టీడీపీలో ఆ నలుగురంటే ఎంతో గౌరవం: వైసీపీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ఆరోపణలపై ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. తాను రూ.1500 కోట్లు సంపాదించినట్లు లోకేష్ చెప్పారని, వాటిని నిరూపిస్తే నడిరోడ్డులో ఉరితీయాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణకైనా సిద్ధమేనన్నారు. తెలుగుదేశం పార్టీలోని కళా వెంకట్రావు, బీద రవిచంద్ర, బుచ్చయ్య చౌదరి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డిని తన ఇంటికి పంపిస్తే అవసరమైన అన్ని ఆస్తి వివరాలను ఇస్తానన్నారు. టీడీపీ లో ఈ నలుగురు నాయకులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. డాక్యుమెంట్లన్నీ వారికిస్తానని, తన సంపాదన నిజమైతే వారే నిరూపిస్తారన్నారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను లోకేష్ చదవడం కాదన్నారు. లోకేష్ తాత రెండెకరాలిస్తే చంద్రబాబు రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తన గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిని అడగాలన్నారు. విదేశాల్లో అమ్మాయిలతో ఎవరున్నారో తెలుసని, చూడండంటూ విదేశాల్లోని లోకేష్ ఫొటోలు చూపించారు. తన తండ్రిని లోకేష్ పొగిడారని, అటువంటి గొప్ప వ్యక్తిని మంత్రివర్గం నుంచి తొలగించేంతవరకు చంద్రబాబు నిద్రపోలేదని విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యేలపై బురద జల్లుకుంటూ వెళ్లినంత మాత్రాన చంద్రబాబును, లోకేష్ ను ప్రజలెవరూ నమ్మరన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మాఫియాగా ఎమ్మెల్యే మారారని, కోట్లరూపాయలు కూడబెట్టారని, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాతో కుమ్మక్కయ్యారని, ఎమ్మెల్యేను నల్లతాచు అంటూ అభివర్ణించారు. ఏ పనిచేసినా ఎమ్మెల్యే కమీషన్ తీసుకుంటారన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications