ఆయన- శిలాఫలకాలు, శంకుస్థాపనల శాఖ మంత్రి..!!
అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు, నారా లోకేష్, అయ్యన్నపాత్రుడిని సైకోలతో పోల్చారు. అయ్యన్న పాత్రుడికి మైక్ దొరికితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నాయకులపై విమర్శలకు దిగితే తాము అంతకంటే రెట్టింపుగా మాట్లాడుతామని హెచ్చరించారు.

జగన్ పర్యటన నాడు..
నర్సీపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ హయాంలో వందల కోట్ల రూపాయలను అయ్యన్నపాత్రుడు వెనకేసుకున్నాడని, అధికారంలో పోయేసరికి మతిభ్రమించిందని ఆరోపించారు. మందు ఎక్కువై మతిలేని మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. నర్సీపట్నంలో జగన్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన అయ్యన్న.. ఆ రోజున పిల్లిలా దాక్కున్నాడని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు..
తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారిలో అయ్యన్నపాత్రుడు కీలక పాత్ర పోషించాడని ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. అదే అలవాటుతో అయ్యన్నపాత్రుడు తనను ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకూ వెన్నుపోటు పొడిచాడని అన్నారు. నర్సీపట్నంలో పెద్దచెరువుకు ట్యాంక్ బండ్ కడతానంటూ హామీ ఇచ్చి.. శిలాఫలకాలతో వదిలేశాడని పెట్ల ఉమాశంకర్ గుర్తు చేశారు.

అవన్నీ ఏమయ్యాయి..
నర్సీపట్నంలో ఇండోర్ స్టేడియం, ఇంటింటికీ మంచినీరు, రోడ్లు విస్తరణ, కళ్యాణమండపం వంటి సౌకర్యాలను కల్పిస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించిన అయ్యన్నపాత్రుడి నాటకాలను ఓటర్లు పసిగట్టారని, అందుకే 2019 ఎన్నికల్లో ఆయనను ఇంటికి సాగనంపారని చెప్పారు. నియోజకవర్గంలో అయ్యన్నపాత్రుడు వేసిన శిలాఫలకాలు, సమాధి ఫలకాలుగా మిగిలాయే తప్ప ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. చంద్రబాబు హయాంలో అయ్యన్నపాత్రుడు శిలాఫలకాల, శంకుస్థాపనల మంత్రిగానే మిగిలాడని చురకలు అంటించారు.

కొత్త పుంతలు..
తమ ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొత్త పుంతలు తొక్కుతున్నాయని పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. కిందటి నెలలో స్వయంగా వైఎస్ జగన్ నియోజకవర్గంలో పర్యటించారని, 1,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నర్సీపట్నం మున్సిపల్ పరిధిలో 25 శాతం ఇంటి పన్నులను తగ్గించారని గుర్తు చేశారు.

మరిన్ని అభివృద్ధి పనులు..
నర్సీపట్నానికి 500 కోట్ల రూపాయల వ్యయంతో మెడికల్ కాలేజీని కేటాయించారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఏలేరు నుంచి తాండవ రిజర్వాయర్ అనుసంధానం కార్యక్రమానికి జగనే శంకుస్థాపన చేశారని, ఆయన మాట ఇస్తే- నెరవేర్చితరుతారని పెట్ల గణేష్ అన్నారు.












Click it and Unblock the Notifications