రోడ్డు ప్రమాదం: గాయపడ్డ టీడీపీ నేతను ఆసుపత్రికి చేర్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే..!
చిత్తూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, విలవిల్లాడుతున్న తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు ఒకరికి సత్వరమే వైద్య చికిత్స అందడానికి సహకరించారు. స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఆసుపత్రికి తరలించారు. ఆ టీడీపీ నాయకుడికి మెరుగైన వైద్య చికిత్సను అందజేయాలని డాక్టర్లకు ఫోన్‌లో ఆదేశించారు.
ఆ ఎమ్మెల్యే- వెంకట గౌడ. చిత్తూరు జిల్లాలోని పలమనేరు స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరుకు నిరసనగా కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పలమనేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లిన స్థానిక టీడీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

లారీ ఢీ కొనడంతో ఆయన కాలికి గాయమైంది. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ఎమ్మెల్యే వెంకట గౌడ ఆయనను గమనించారు. వెంటనే కారు నుంచి కిందికి దిగారు. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చిన వెంటనే తన చేతులతో ఓబుల్ రెడ్డిని స్ట్రెచర్ మీదికి చేర్చారు. అంబులెన్స్ వెళ్లేంతవరకూ అక్కడే ఉన్నారు. ఆయనను ఏ ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నారో అడిగి తెలుసుకుని.. అక్కడి డాక్టర్లకు ఫోన్ చేశారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.












Click it and Unblock the Notifications