టీడీపీలోకి మరో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీ ? ముహుర్తం ఖరారు..!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. ఇందులో భాగంగా టికెట్లు దక్కని నేతలు ఇతర పార్టీలకు కూడా జంప్ అయిపోతున్నారు. రాజకీయంగా తమకు ఎక్కడ సెట్ అవుతుందనుకుంటే అక్కడికి వెళ్లిపోయేందుకు నేతలు ఏమాత్రం జంకడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల కారణంగా ఆ పార్టీకి ఓ సిట్టింగ్ ఎంపీ, మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దూరం కాబోతున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు నిన్న వారిద్దరూ ఇదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొందరితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. ఇందులో లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి ఇద్దరూ టీడీపీలో చేరేందుకు అంగీకరించారు. ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైంది.

Recommended Video

ఈ నెల 22న లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరబోతున్నారు. పార్టీలో చేరాక లావు శ్రీకృష్ణదేవరాయలుకు తిరిగి నరసరావుపేట సీటు నుంచి పోటీకి చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే జంగా కృష్ణమూర్తికి మాత్రం గురజాల సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో యరపతినేని, జంగా మధ్య ఎంపీ లావు కృష్ణదేవరాయలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలును ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ కోరడం, ఆయన నిరాకరించి పార్టీని వీడటం తెలిసిందే. అలాగే గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డికి బదులు తనకు సీటు కావాలని జంగా కృష్ణమూర్తి కోరినా జగన్ ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు.












Click it and Unblock the Notifications