ఎంపీ రఘురామ సంచలనం: స్వామితో కలిసి ఇలా -ఏపీ జగన్ క్రైస్తవ రాజ్యం -సాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవంటూ
సొంత పార్టీపై, అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అదే పనిగా విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా మరో సంచలనానికి పాల్పడ్డారు. రాజధాని రచ్చబండ పేరుతో గడిచిన రెండేళ్లుగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తోన్న ఆయన.. దేశ ద్రోహం కేసులో అరెస్టయి బెయిల్ పై బయటికొచ్చిన తర్వాత రచ్చబండ కాదంటూనే మీడియా సమావేశాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఎన్నడూ లేనిది ఇవాళ రెండో వ్యక్తితో కలిసి మీడియాతో మాట్లాడారు రఘురామ. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతితో కలిసి రెబల్ ఎంపీ నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు...

క్రైస్తవ రాజ్యంలా ఏపీ
ఢిల్లీలోని తన నివాసంలో జరిగే మీడియా సమావేశాల్లో ఎంపీ రఘురామ ఒక్కరే మాట్లాడటం రివాజుగా ఉండగా, ఇవాళ మాత్రం తన ఇంటికొచ్చిన స్వామిని సైతం ఎంపీ ప్రెస్ మీట్లో కూర్చో బెట్టారు. ముందుగా మాట్లాడిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అసాధారణ రీతిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలు, దేవాలయాల భూములు, హిందూ సనాతన సంప్రదాయాలకు రక్షణలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి బలవంతపు మతమార్పిడిలు జరుగుతున్నాయన్నారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వమే టెండర్లు పిలిచి ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోందని ఆరోపించారు. అంతేకాదు,

హిదువుల నాశనానికి జగన్ కంకణం
ఏపీని క్రైస్తవ రాజ్యంగా మార్చే క్రమంలో రాష్ట్రంలో హిందూసనాతన ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్వామి శ్రీనివాసానంద ఆరోపించారు. ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు దోషులను పట్టుకోలేదని విమర్శించారు. కొంతమంది మంత్రులు కూడా హిందు సనాతన సంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని దుశ్చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దోషులను శిక్షించి హిందూ సమాజానికి మనో ధైర్యాన్ని ఎందుకు ఇవ్వలేకపోతోందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. స్వామి మాట్లాడిన తర్వాత ఎంపీ రఘురామ కొనసాగించారిలా..

ఏపీలో తలకిందుల పాలన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరోగమన పాలన జరుగుతోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో కబ్జాల పర్వం పెరిగిపోయిందని, ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు పెరిగిపోయాయన్నారు. ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచి పోతున్నాయని, ఏపీలో కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనబడటంలేదని చెప్పారు. సీఎం జగన్ ఒక్కసారైనా విశాఖలో పాదయాత్ర చేస్తే అక్కడి పరిస్థులు తెలుస్తాయని, ఏపీలో శాంతిభద్రతలు లేవని రఘురామ పేర్కొన్నారు.

సీఐడీ సునీల్‌కు పరోక్ష పంచ్
రాజకీయ నాయకుల మెప్పు కోసం ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు తప్పులు చేస్తే శిక్షలు అనుభవించక తప్పదని ఎంపీ రఘురామ అన్నారు. కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తప్పును తప్పుగా చెప్పాలని అధికారులకు రఘురామ హితవు పలికారు. అనవసర అత్యుత్సాహం ప్రదర్శిస్తే శిక్ష తప్పదన్నారు. ఇటీవల ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. రఘురామ ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర హోంశాఖ.. సీఐడీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా, రఘురామ లేఖలోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలలని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసిన దరమిలా రఘురామ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సునీల్ కుమార్ భార్య గృహహింస కేసులో చార్జిషీటు దాఖలైన కారణంగా ఆయనను ప్రాధాన్యంలేని శాఖకు బదిలీ చేయాలని రఘురామ కోరడం విదితమే. కాగా,

సాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి, ఛీ కొట్టారు..
తన మాటల్లో సీఎం జగన్ కంటే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డినే ఎక్కువగా టార్గెట్ చేసే రఘురామ మరో సంచలన విషయాన్ని వెటకారంగా చెప్పుకొచ్చారు. ఇటీవలే విస్తరించిన మోదీ కేబినెట్ లోకి వైసీపీ కూడా చేరాల్సిందిగా బీజేపీ కోరిందని సాయిరెడ్డి చెప్పినట్లుగా ఓ వార్త పత్రికలో వచ్చిన కథనంపై రఘురామ సెటైర్లు వేశారు. ''బీజేపీ కేబినెట్‌లోకి ఆహ్వానిస్తే.. వైసీపీ కాదని చెప్పారట.. మూడు పోస్టులు ఇస్తామన్నారట.. సపోర్ట్ చేస్తాం కానీ ఇలా కేంద్రంలో చేరమని చెప్పారట.. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారని ఓ పత్రికలో రాశారు. నాకు తెలిసి బతిమాలింది నిజం.. కానీ బతిమాలింది మా పార్టీ.. ఛీ అంది ఆ పార్టీ. కానీ మా వాళ్లు మాత్రం అటు ఇటు మార్చి చెప్పారు. మేం అడిగితే వాళ్లు ఛీ కొట్టిన మాట నిజం'' అని రఘురామ అన్నారు. మరోవైపు, రెబల్ ఎంపీ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నోటీసులకు స్పందించిన సీబీఐ.. కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని కోరగా విచారణ ఈనెల 13కు వాయిదా పడింది. అయితే, కోర్టు నోటీసులపై ఎంపీ సాయిరెడ్డి స్పందించకపోవడంపై జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 13న సీబీఐతో కలిసి సాయిరెడ్డి కౌంటర్ వేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications