NTR నాణెం పూజకు పనికిరాని పువ్వు-సాయిరెడ్డి సెటైర్లు-హెరిటేజ్ కొంటుందా?
ఏపీలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో స్మారక 100 రూపాయల నాణెం విడుదల చేసింది. నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆయన భార్య లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీంతో గుర్రుగా ఉన్న వైసీపీ నేతలు ఎన్టీఆర్ నాణెంపై సెటైర్లు వేస్తున్నారు.
ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ నాణేన్ని, టీడీపీని, చంద్రబాబును, ఆయన సంస్ధ హెరిటేజ్ ను కలిపి సెటైర్లు వేస్తూ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ నాణెంపై ఆయన విమర్శలు గుప్పించారు. దీన్ని హెరిటేజ్ సంస్ధ కొనుక్కోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ ఈ వ్యవహారంపై ఎంత ఆగ్రహంగా ఉందో ఇట్టే అర్దమవుతోంది.

ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణెం పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. మిగతా కాయిన్స్, కరెన్సీలా మార్కెట్ చలామణీలో ఉండబోదన్నారు. దాని విలువను కూడా కేంద్ర ఆర్ధిక శాఖ రూ.4160గా నిర్ణయించిందన్నారు. దీనికి చంద్రబాబు గారి బృందం చేసిన హడావిడి అంతా ఇంతా కాదన్నారు. మింట్ లో అచ్చు వేసే 12 వేల నాణేలను హెరిటేజ్ తో కొనిపిస్తారా బాబు గారూ అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.

వాస్తవానికి ఇలా దివంగత ప్రముఖుల పేరుతో కేంద్రం విడుదల చేసే నాణేలన్నీ వాటి వాస్తవ విలువ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగానే ఉంటాయి. దీనికి కారణం అవి వాస్తవ నాణాల్లా ఇనుముతో కాకుండా వెండి, రాగి వంటి లోహాలతో తయారు చేస్తారు. అలాగే వీటిని మార్కెట్లో చెలామణీకి కాకుండా గుర్తుగా ఉంచుకనేందుకు జనం కొనుక్కునేలా ప్రోత్సహించేందుకే విడుదల చేస్తారు. వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా ఆయా ప్రముఖుల అభిమానులు కూడా వారి గుర్తుగా ఇళ్లలో ఉంచుకుంటారు.












Click it and Unblock the Notifications