విపక్షాల ఐక్యతా ? రాహుల్ జీ వాట్ ఏ జోక్ ! భారత్ జోడో యాత్రపై విజయసాయిరెడ్డి సెటైర్లు
బీజేపీ విద్వేష విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తున్న సాయిరెడ్డి.. భారత్ జోడో యాత్రను సైతం లక్ష్యంగా చేసుకున్నారు.
భారత్ జోడో యాత్రతో విపక్షాల్ని రాహుల్ ఏకం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాహుల్ యాత్రతో విపక్షాలు ఏమవుతాయా అనే ప్రశ్నతో ఇవాళ ట్వీట్ పెట్టారు. ఇందులో రాహుల్ ను ఉద్దేశించి సాయిరెడ్డి పలు ప్రశ్నలు కూడా వేశారు. అంతే కాదు రాహుల్ గాంధీ విలాసవంతమైన కంటెయినర్లలో పడుకుంటూ భారత్ జోడో యాత్ర చేయడాన్ని కూడా సాయిరెడ్డి తప్పుబట్టారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

59 ఏసీ కంటెయినర్ల కాన్వాయ్ నుంచి రాహుల్ గాంధీ విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చారని, తన పార్టీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడెవరో కూడా నిర్ణయించుకోని పార్టీ విపక్షాల ఐక్యతకు పిలుపునిచ్చిందంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చివర్లో వాట్ ఏ జోక్ రాహుల్ జీ అంటూ సెటైర్ కూడా వేశారు. ఈ మధ్య రాహుల్ ను, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సాయిరెడ్డి వరుస ట్వీట్లు పెడుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇతర పార్టీల నుంచి స్పందన లభించడం లేదు. అదీ ఇంగ్లీష్ లోనే పెడుతున్నా జాతీయ నేతలెవరూ స్పందించడం లేదు. దీంతో సాయిరెడ్డి మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications