తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతోంది ! విజయసాయిరెడ్డి ట్వీట్...
వచ్చే నెలలో తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్లు కూడా విడుదలవుతున్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో గెలిచే పార్టీలపై ఒపీనియన్ పోల్స్, సర్వేలు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో మెజార్టీ సర్వేలు ఈ ఐదు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఇందుకు భిన్నమైన వాదనతో సంచలన ట్వీట్ చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతోందంటూ సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా ఓడిపోతున్న రాష్ట్రాలతో పాటు వాటికి గల కారణాలను కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన కర్నాటకలో పరిస్దితులపైనా సాయిరెడ్డి ట్వీట్ లో విశ్లేషించారు.

"నా మాటలను గుర్తించండి, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుంది.పేదలు, అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పనిచేయదు. గత ఐదేళ్లలో రాజస్థాన్ అధ్వాన్నమైన పాలనను చూసింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పనులన్నీ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి నిధులివ్వడంలో బిజీగా ఉంది. కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ఎప్పుడూ వెనుకబడిన రాష్ట్రంగా ఉండేది." అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
అలాగే "కాంగ్రెస్ కుంభకోణాలు, కుంభకోణాలు, దుష్పరిపాలన గురించి దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అత్యంత అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీ విభజించిందని, వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కలలు కంటుంది" అంటూ సాయిరెడ్డి విశ్లేషించారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఇన్నాళ్లుగా సాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లకు ఇది పరాకాష్టగా ఉందనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications