వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై దాడి- రాళ్లు, కర్రలు పెట్రోల్ బాంబులతో..!
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) కాన్వాయ్ పై ప్రత్యర్థులు ఇవాళ దాడి చేశారు. కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో దశలో భాగంగా తమ అభ్యర్ధుల నామినేషన్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో స్ధానిక ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. తమ అభ్యర్ధుల్ని తన వాహనాల్లో తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తున్నారు. దీంతో ప్రత్యర్దులు ఆయన కాన్వాయ్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కాన్వాయ్ లోని వాహనాలు ధ్వంసమైట్లు తెలుస్తోంది.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నామినేషన్లు దాఖలు చేస్తున్న పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై ఇవాళ ఉదయం దాడి జరిగింది. కడప జిల్లాలోని సింహాద్రిపురంలోని అంకాలమ్మ గూడూరు సమీపంలో బీటెక్ రవి నేతృత్వంలోని టీడీపీ మద్దతుదారులు ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులు కూడా విసిరినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన సర్పంచ్ అభ్యర్ధుల్ని నామినేషన్లు వేయనివ్వకుండా అధికార కూటమి అడ్డుకుంటోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. నామినేషన్లు వేసే అభ్యర్ధులకు తగిన ఎస్కార్ట్ ఇవ్వాలని పోలీసుల్ని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల తర్వాత కేవలం సర్పంచ్ అభ్యర్ధులకు ఎస్కార్ట్ కల్పిస్తూ.. వార్డు మెంబర్లను వదిలేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తమ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్ధుల్ని నామినేషన్ కేంద్రాలకు అవినాష్ రెడ్డి తీసుకెళ్తుండగా వాహనాలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. అయినా పోలీసులు వారిని అడ్డుకోకపోవడంతో పేట్రేగిపోయారు.














Click it and Unblock the Notifications
