మరో వైసీపీ ఆఫీస్‌కు నోటీసులు: కూల్చివేతలు కంటిన్యూ?
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భవనాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించడం ఖాయంగా కనపిస్తోంది.
రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో నేలమట్టం చేశారు.

అదే సమయంలో విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన భవనానికీ నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అక్రమ కట్టడమని, నిర్మాణంలో ఉల్లంఘటనలు చోటు చేసుకున్నాయంటూ నోటీసులు ఇచ్చారు. దాన్ని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు.
ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన మరో పార్టీ భవనానికీ నోటీసులు అందాయి. అనంతపురంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఎం హరిప్రసాద్ ఈ నోటీసులు ఇచ్చారు.
అనంతపురంలోని హెచ్ఎల్‌సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం ఇది. సర్వే నంబర్లు 136- 1బీ 1బీ2, ఏ2 గల ఖాళీ స్థలంలో జీ ప్లస్ 1 కింద నిర్మితమౌతోంది. ఇది అక్రమ నిర్మాణం అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ యాక్ట్ 452 (1), 461 (1) కింద వాటిని జారీ చేశారు. తక్షణమే భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించారు.
ఏడు రోజుల్లోగా ఉల్లంఘనలను సరిచేసుకోకపోవడం లేదా కట్టడాన్ని తొలగించకపోతే 452 (1), 461 (1) కింద కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మండిపడుతున్నారు. కూల్చివేతల ప్రభుత్వంగా అభివర్ణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications