చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారు - సీఎం జగన్ రూటలోనేనా..!!
టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకొనే సమయం వచ్చింది. సీఎం జగన్ టార్గెట్ గా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు..ఇప్పుడు సీఎం రూటులోనే నడుస్తారా..లేక భిన్నంగా వ్యవహరిస్తారా అనేది చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. జగన్ కు తిరిగి అధికారం దక్కకుండా చేయటం చంద్రబాబు వ్యూహం. దీంతో.. ఇద్దరూ తన ఆలోచనలకు పదును పెడుతున్నారు.
అందులో భాగంగా రాష్ట్రంలో తన వ్యూహాలు పదును పెడుతూనే..ఢిల్లీ స్థాయిలోనూ తనకు సపోర్ట్ పెంచుకొనేలా జగన్ అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ తనను ఏ విధంగా ఢిల్లీ ముఖ్యనేతలకు దూరం చేయటంలో వ్యవహరించారో..ఇప్పుడు చంద్రబాబు అదే కౌంటర్ ప్లాన్ అమలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రతీ అడుగు వెనుకా
రానున్న ఎన్నికల్లో బీజేపీ తమతో కలిసి మిత్రపక్షంగా ముందుకు వచ్చినా రాకున్నా.. సీఎం జగన్ కు దూరం జరగాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగా..ఆకస్మికంగా బీజేపీ కోరకపోయినా..చివరి నిమిషంలో రాష్ట్రపతి అభ్యర్ధిగా ముర్ముకు మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ తరహాలోనే ముర్ముతో సమావేశం ఏర్పాటు చేసి..రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక విషయంలో ప్రధానిని అభినందించారు. ఇక, ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ తమ అభ్యర్ధిని ప్రకటించింది.
గిరిజన మహిళ కావటంతో సామాజిక న్యాయం చేయటంలో మద్దతుగా ముర్ము అభ్యర్ధిత్వానికి అండగా నిలుస్తున్నట్లు వైసీపీ - టీడీపీ ప్రకటించాయి. ఇక, ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఓటింగ్ లో కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉంటారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ
వైసీపీకి లోక్ సభలో 22 మంది.. రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి లోక్ సభలో ముగ్గురు..రాజ్యసభలో ఒకరు ఉన్నారు. దీంతో..టీడీపీ మద్దతు గురించి పెద్దగా చర్చ జరిగే అవకాశం లేదు. కానీ, వచ్చే ఎన్నికల కోణంలో ఢిల్లీకి చంద్రబాబు తన రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. రాష్ట్రపతి తరహాలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతిచ్చి.. జగన్ మాత్రమే కాదు..తాను కేంద్ర పెద్దలతోనే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, ఎన్డీఏకు మిత్రపక్షం కాకపోయినా.. ఎన్డీఏ నిర్ణయాలకు ప్రతీ సందర్భంలోనూ వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఇక, ఉప రాష్ట్రపతి అభ్యర్ధి ఖరారు కాగానే..వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి స్పందన..ఇచ్చిన సంకేతాలు వైసీపీ మద్దతు ఇవ్వనుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు
అయితే, టీడీపీ ఏం చేయబోతుందనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. రేపు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల చివరి రోజు. ధన్ కర్ నామినేషన్ లో సాయిరెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. మరి.. టీడీపీ అధినేత ఇప్పుడు ఈ విషయంలో మరోసారి మద్దతు ప్రకటించి.. జగన్ తో పోటీగా నిలుస్తారా.. లేక, దూరంగా ఉండి..తనది జగన్ దారి కాదని తేల్చి చెబుతారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications