జీవో నంబర్ 2: వలంటీర్లతో ప్రజాస్వామ్యానికి గొడ్డలి: ఎమ్మెల్యేలకు ఊపిరి ఆడట్లే: జగన్‌కు రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని మరో లేఖాస్త్రాన్ని సంధించారు. కొన్నిరోజులుగా వరుసగా ఆయన వేర్వేరు అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై లేఖలను రాస్తూ వస్తోన్నారు.దాన్ని కొనసాగించారు. తాజాగా మరో లెటర్ రాశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మీడియా ముందుకు రాలేకపోతోన్న ఆయన లేఖల ద్వారా తాను చెప్పదలచుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తోన్నారు.

జాయింట్ చెక్ పవర్‌పై..
తాజాగా రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖ..సర్పంచులు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌కు సంబంధించినది. గ్రామస్థాయిలో పరిపాలనను బలోపేతం చేయడానికి సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్‌ను కల్పించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వైఎస్ జగన్‌కు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన జాతిపిత మహాత్మాగాంధీ సూక్తులను ప్రస్తావించారు. పంచాయతీ రాజ్ అనే పదానికి అర్థాన్ని వివరించారు. మహాత్ముడు గ్రామ స్వరాజ్యం కోసం కలలు గన్నారని, దాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు.

జీవో నంబర్ 2 రద్దు
పంచాయతీ రాజ్ (73వ సవరణ) చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామ ఆరోపించారు. జీవో నంబర్ 2 దీనికి పూర్తి భిన్నమని విమర్శించారు. జీవో నంబర్ 2ను తీసుకుని రావడం పంచాయతీ రాజ్ చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని ధ్వజమెత్తారు.
గ్రామ సచివాలయాలు, వలంటీర్లు సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జవాబుదారీతనంగా ఉండట్లేదని పేర్కొన్నారు. ఇది ప్రజల ద్వారా ఎన్నుకొన్న సర్పంచ్ వ్యవస్థను అవమానించినట్టేనని రఘురామ చెప్పారు. పంచాయతీ రాజ్ పరిపాలనకు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తోన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు.

మధ్యవర్తులుగా వలంటీర్లు..
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వలంటీర్లు పనిచేస్తోన్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్టేనని రఘురామ విమర్శించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికే వలంటీర్లను తీసుకొచ్చారని ప్రజలు.. ప్రత్యేకించి గ్రామీణులు భావిస్తున్నారని చెప్పారు.
గ్రామీణ స్థాయిలో పరిపాలన బాధ్యతలన్నింటినీ వలంటీర్లకు అప్పగించడం పట్ల అటు శాసన సభ్యులు కూడా ఇబ్బందిపడుతున్నారని, వారికి కూడా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రజాస్వామ్య మూలాలకు గొడ్డలిపెట్టుగా వలంటీర్ల వ్యవస్థ పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాయింట్ చెక్ పవర్
సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు పనిచేసే స్వేచ్ఛను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. దీనికి అడ్డుగా ఉంటోన్న జీవో నంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే- సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్‌ను కల్పించాలని అన్నారు.
ఈ రెండు చర్యలను తీసుకోవడం ద్వారా గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల పరిపాలనను పునరుద్ధరించినట్టవుతుందని చెప్పారు. ఈ చర్యలు ఎంత త్వరగా తీసుకుంటే ప్రజాస్వామ్యానికి అంత మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చెక్ పవర్ లేకపోవడం వల్ల సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications