లోక్ సభ స్పీకర్ తో రఘురామ రాజు భేటీ-వైసీపీ ఫిర్యాదు తిరస్కరించాలని వినతి
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో నిత్యం పోరాటం చేస్తూ రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు ప్రమాదం ఎదుర్కొంటున్నారు. రఘురామపై ఇప్పటికే వైసీపీ లోక్ సభ స్పీకర్ కు నాలుగుసార్లు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ తాజాగా మరింత ఒత్తిడి పెంచుతోంది.
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేదిస్తున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో రఘురామపై వేటు వ్యపహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రఘురామరాజు ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు. వైసీపీ తనపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆయనకు వివరణ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలతో విభేదించినంత మాత్రాన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కాదని ఆయన స్పీకర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై స్పీకర్ ఓం బిర్లా అడిగిన ప్రశ్నలకు రఘురామ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ తప్పుడు ఫిర్యాదులేనని రఘురామ చెప్పినట్లు సమాచారం. గతంలో తనపై స్పీకర్ కు ఫిర్యాదు కోసం ఒకే మ్యాటర్ తో వెయ్యి లేఖలు తయారు చేయించి చివరి నిమిషంలో వాటిని విరమించుకున్నట్లు రఘురామ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు లోక్ సభ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications