రాజీనామాకు రఘురామ రెడీ- మళ్లీ పోటీచేసి గెలుస్తా- వైసీపీపై వ్యతిరేకత నిరూపిస్తానని సవాల్
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం పోరు చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. అనర్హత వేటుకు ముందే రాజీనామా చేసి గెలిచేందుకు సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను నిరూపిస్తానన్నారు.

రఘురామ పోరు
ఏపీలో 2019 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆరు నెలలకే వైసీపీపై పోరు మొదలుపెట్టారు. ఇంటా బయటా వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత,సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో కోర్టులు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పోరు ప్రారంభించారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

రఘురామపై అనర్హత వేటు
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రఘురామకృష్ణంరాజును ఎలాగైనా అనర్హత వేయించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు కలిసి ఫిర్యాదులు కూడా చేసిన వైసీపీ ఎంపీలు.. ఆయన చర్యలు తీసుకోకపోవడంతో ఓ దశలో లోక్ సభ కార్యకలాపాల్ని అడ్డుకుంటామని కూడా హెచ్చరికలు చేశారు. అయినా పార్లమెంటు సమావేశాల్లో ఆయనపై స్పేకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం రఘురామకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ.. ఈసారి ఎలాగైనా రఘురామపై వేటు వేయించాలని చూస్తోంది.

రాజీనామాకు సిద్ధమైన రఘురామ
వైసీపీ ఎంపీల ఫిర్యాదు మేరకు తనపై లోక్ సభ స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చన్న సంకేతాలతో రఘురామ అప్రమత్తమయ్యారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీవీ ప్రయత్నిస్తోందని, అయితే అంతకంటే ముందే తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామకృష్ణంరాజు ఇవాళ సంచలన ప్రకటన చేశారు. తద్వారా నరసాపురం ఎంపీ స్ధానంలో ఉప ఎన్నిక తీసుకొచ్చేందుు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

గెలిచి వైసీపీపై వ్యతిరేకత నిరూపిస్తా
నరసాపురం ఎంపీ స్ధానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రఘురామరాజు... ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం నుంచి తిరిగి గెలిచి వైసీపీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత నిరూపిస్తానని ఆయన ఇవాళ సవాల్ విసిరారు. దీంతో రఘురామ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నది మాత్రం స్పష్టం కాలేదు. అయితే రఘురామకు టీడీపీ మద్దతు మాత్రం ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications