ఆ విషయం వైఎస్ సునీతకు ఎలా తెలిసింది..?: అవినాష్ సూటి ప్రశ్న..!!
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ తప్పుదారి పడుతోందని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు సీబీఐ అధికారులు తనను రెండుసార్లు విచారించారని, అందులో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అవినాష్ రెడ్డి అన్నారు. దీనితో మూడోసారి విచారణ సందర్భంగా తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. తాను సీబీఐ విచారణలో ఉన్నందున.. తన పిటీషన్ పై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చిందనేది పూర్తిగా తెలియరాలేదని చెప్పారు.

ఎంపీ టికెట్ కోసమా?
సోమవారం వరకు తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు.. సీబీఐ అధికారులను ఆదేశించినట్లు మీడియా ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఇవ్వాళ ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసి.. బయటికి వచ్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఒక ఎంపీ టికెట్ కోసం ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిదంటే కడప జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

కీలక విషయాలు పక్కన పెట్టి..
వైఎస్ వివేకా హత్యకేసులో చాలా కీలకమైన విషయాలను పక్కన పెట్టి, చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అవినాష్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రెండుసార్లు సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించిన విషయం తెలిసిందే. ఈ రెండు విచారణలకు సంబంధించిన పూర్తి వివరాలు, దీనికి సంబంధించిన హార్డ్ డిస్కులను తమకు సమర్పించాలంటూ హైకోర్టు- సీబీఐ అధికారులను ఆదేశించడాన్ని ఆయన స్వాగతించారు.

టీడీపీ టేక్ అవుట్..
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ తప్పుదారి పడుతోందనే విషయాన్ని తాను ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నానని అవినాష్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని తాను చాలా స్పష్టంగా హైకోర్టుకు తెలియజేశానని పేర్కొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తన ప్రమేయం ఉన్నట్లు గూగుల్ టేక్- అవుట్ ద్వారా సీబీఐ అధికారులు గుర్తించారనడంలో అర్థం లేదని అవినాష్ రెడ్డి చెప్పారు. అది గూగుల్ టేక్ అవుట్ కాదని, టీడీపీ టేక్ అవుట్ గా ఆయన అభివర్ణించారు.

ప్రచారం కూడా..
తప్పుడు ఆరోపణలు, బలవంతంగా కేసులు నమోదు చేయడం- ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేని వారిని విచారించడం సరికాదని, దీనివల్ల అసలు దోషులను తప్పించినట్టవుతుందని వ్యాఖ్యానించారు. హత్యకు గురయ్యే ముందురోజు కూడా వివేకానందరెడ్డి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైదుకూరు నియోజకవర్గం పరిధిలోని చాపాడు మండలంలో 300 ఇళ్లకు డోర్ టు డోర్ ప్రచారం చేశారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు.

తన తరఫున ప్రచారం చేశారు..
మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు ఓటు వేయాలంటూ ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని అవినాష్ రెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఎంపీ టికెట్ కోసమే తాను ఆయనను హత్య చేయించినట్లు ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు.

ఎమ్మెల్యే నుంచి వివరణ..
ఈ విషయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నుంచి ఎందుకు వివరణ తీసుకోరని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారాయన. కోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున తాను ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదని అన్నారు. తనకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన పిటీషన్ లల్లో అన్నీ నిరాధార ఆరోపణలేనని వివరించారు.

సునీతారెడ్డికి లీకులు..
తాను లంచ్ మోషన్ పిటీషన్ వేస్తే- అది విచారణకు రాకముందే తన చెల్లెలు సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటీషన్ వేసిందని, ఈ సమాచారం ఆమెకు ఎలా చేరిందని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ అధికారులే లీకులు ఇస్తోన్నారని ఆరోపించారు. కోర్టు నుంచి నోటీసులు వచ్చిన మరుక్షణమే సీబీఐ అధికారులకు ఆ విషయాన్ని బయటికి లీక్ చేస్తోన్నారని విమర్శించారు. తాను ఇదివరకు సుప్రీంకోర్టుకు వెళ్లినా- ఆ విషయం కూడా తన చెల్లెలికి తెలిసిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications