ఆ మేయర్ సీటు వైసీపీ ముందే గెలిచేసిందా ?- టీడీపీ సర్వేయర్ హింట్..!
ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నాలుగు నగర పాలక సంస్థల్లో అనూహ్య ఫలితాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఈ నాలుగు కార్పోరేషన్లలో కూటమి పార్టీలకూ, వైసీపీకి మధ్య నెలకున్న పోటీ ఓవైపు, కూటమి పార్టీల్లోనే క్రాస్ ఓటింగ్ మరోవైపు టెన్షన్ పెంచేస్తున్నాయి. దీంతో నవంబర్ 26న జరిగే పోలింగ్ లో ఏదైనా జరగవచ్చనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ తరుణంలో టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇస్తారనే పేరున్న సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట కీలకమైన ఓ కార్పోరేషన్ లో మేయర్ ఫలితంపై తన అంచనాను ఇవాళ వెల్లడించారు.
ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టులో రైజ్ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో ఏం జరగబోతోందనే దానిపై హింట్ ఇచ్చేశారు. శ్రీకాకుళం మేయర్ స్ధానానికి కూటమి తరఫున జనసేన అభ్యర్ధి దానేటి రాధారాణి, వైసీపీ (YSRCP) తరపున టీడీపీ నుంచి తాజాగా పార్టీలో చేరిన గుండా లక్ష్మీదేవి రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దానేటి ఆర్ధిక బలం, గుండ జనబలం.. ప్రజా తీర్పు సుస్పష్టం అంటూ ప్రవీణ్ పుల్లట ట్వీట్ చేశారు. అలాగే ముందే చేతులెత్తేసిన బిగ్ హెడ్స్ అంటూ మరో హింట్ కూడా ఇచ్చారు. సిక్కోలు మేయర్ పై సమగ్ర నివేదిక త్వరలో ఇస్తానని ప్రవీణ్ తెలిపారు.

దానేటి ఆర్థిక బలం.."గుండ" జన బలం !ప్రజాతీర్పు సుస్పష్టం..ముందే చేతులెత్తేసిన బిగ్ హెడ్స్సిక్కోలు మేయర్ పై సమగ్ర నివేదిక సిద్దం..
— Praveen Pullata (@praveenpullata) November 19, 2026
శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో కూటమి తరఫున జనసేన అభ్యర్ధి దానేటి రాధారాణి బరిలో ఉన్నా.. డివిజన్లలో మాత్రం అత్యధిక చోట్ల టీడీపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. దీంతో వీరంతా జనసేన మేయర్ అభ్యర్ధికి ఓటు వేయిస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో దానేటి రాధారాణితో పోలిస్తే రాజకీయాల్లో సీనియర్, స్దానికంగా మంచి పేరున్న గుండా లక్ష్మీదేవి వైసీపీ తరపున బరిలో ఉండటం ఆమెకు ఇబ్బందిగా మారింది. గుండా లక్ష్మీదేవికి టీడీపీ మేయర్ పోస్టు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పడంతో ఆమెకు లభిస్తున్న సానుభూతి కూడా ఇక్కడ ప్లస్ అవుతోంది. దీంతో శ్రీకాకుళం మేయర్ ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి.














Click it and Unblock the Notifications
