జగన్ అడ్డాలో చంద్రబాబు సవాల్..! క్యాంప్ రాజకీయంతో వైసీపీ కౌంటర్ ..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న స్థానిక సంస్థల్ని క్రమంగా తమ వశం చేసుకుంటోంది. ఎలాగో అధికార పార్టీ కావడంతో స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు చాలా సులువుగా పార్టీలు మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఫిరాయింపులు ఓ ఎత్తు.. కడప జిల్లాలో ఫిరాయింపులు మరో ఎత్తుగా మారాయి. ఇదే క్రమంలో కడప జడ్పీ సీటు కాపాడుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయం మొదలుపెట్టింది.
కడప జడ్పీ ఛైర్మన్ గా ఉన్న అకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన స్ధానంలో జడ్పీ ఛైర్మన్ ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇక్కడ వైసీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో టీడీపీ ఫిరాయింపు రాజకీయాల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వీటికి ఇప్పుడు వైసీపీ కచ్చితంగా కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్ధితి. రేపు ఏదైనా తేడా వచ్చి కడప జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ లాగేసుకుంటే మాత్రం వైసీపీతో పాటు జగన్ కూ కష్టాలు తప్పవు.

కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నిక ఈ నెల 27న జరగనుంది .రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ జేష్టాది శారద ప్రస్తుతం పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా జడ్పీటీసీలను బెంగుళూరు, హైదరాబాద్ క్యాంపులకు వైసీపీ అధిష్టానం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జడ్పీటిసి రామగోవింద రెడ్డిని జడ్పీ చైర్మన్ గా ఖరారు చేసింది.

కడప జిల్లా పరిషత్ లో మొత్తం 50 జడ్పీటిసిలలో ఒకరు రాజీనామా చేయగా,మరో రెండు స్థానాలు ఖాళీ ఉన్నాయి. దీంతో ప్రస్తుతం 47 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో టీడీపీకి 9మంది జడ్పీటీసీలు, వైసీపీకి 38 మంది జడ్పీటీసీలు ఉన్నారు. దీంతో మెజారిటీకి అవసరమైన 24 మంది జడ్పీటీసీల కోసం టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీలో 15మంది జడ్పీటిసీలకు దాదాపు 3 కోట్ల వరకూ టీడీపీ ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిని ప్రలోభాలకు లొంగకుండా చేసేందుకు బెంగళూరు, హైదరాబాద్ క్యాంపులకు వైసీపీ నేతలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications