ఏపీలో రివెంజ్ పాలిటిక్స్: నాడు ప్రజావేదిక: కోరి తెచ్చుకున్న వైరం?
Chandrababu Naidu: రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతోంది. దీన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.
ఈ తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.

ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.
సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్‌కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని, అయినప్పటికీ హుటాహుటిన బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ప్రతీకార రాజకీయాలకు తెర తీసినట్టయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదికను వైఎస్ జగన్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే దీన్ని కూల్చివేసింది జగన్ ప్రభుత్వం.

ఇప్పుడు అదే తరహాలో టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యాయనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేసినట్టయిందని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని మండిపడ్డారు. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని, ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన
పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్‌డోజర్లతో కూల్చివేయించారంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని చెప్పారు.












Click it and Unblock the Notifications