బాలయ్యకు జగన్ మాస్టర్ స్కెచ్..హిందూపురంలో తాజా లెక్కలు ఇవే..!
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం టీడీపీ కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ గెలిచిన స్థానాల్లో హిందూపురం కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ స్థాపించిన నాటి నుంచి అక్కడ టీడీపీ తమ పట్టు నిలుపుకుంటూ వస్తోంది. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులకు అచ్చొచ్చిన నియోజకవర్గం ఇది.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణలు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.ప్రస్తుతం ఇక్కడ నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో గెలిచిన బాలకృష్ణ, 2024 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు.

అయితే ఈసారి ఎలాగైనా హిందూపురంలో విజయం సాధించి, బాలకృష్ణకు చెక్ పెట్టాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుంది. వైసీపీ నుంచి 2014లో నవీన్ నిశ్చల్ , 2019లో ఇక్బాల్ పోటీ చేసి బాలకృష్ణ మీద ఓడిపోయారు. ఇక్బాల్ మొన్నటి నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగారు. ఆయన్ను తప్పించి ఆ స్థానంలో దీపికకు హిందూపురం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది పార్టీ అధిష్టానం.

అంతర్గత పోరుతోనే హిందూపురంలో వైసీపీ ఓడిపోతుందని గుర్తించిన సీఎం జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వాలిపోయారు. అటు ఇక్బాల్, ఇటు నవీన్ నిశ్చల్ వర్గాలతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని.. భవిష్యత్తులో నవీన్ నిశ్చల్‌కు కూడా నామినేట్ పదవి ఇస్తామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చినట్టుగా సమాచారం.

దీపిక గెలుపుకు ఇరు వర్గాలు కూడా కలిసి పని చేయాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. నవీన్ నిశ్చల్ , ఇక్బాల్ ఇద్దరూ కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించడం పెద్ద కష్టం కాదని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది. ఇదే సమయంలో బాలకృష్ణ కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ గెలుపుకు అక్కరకు వస్తాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. హిందూపురంలో గెలిచి బాలకృష్ణకు చెక్ పెట్టాలని చూస్తున్న అధికార పార్టీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications