Mekapati Chandrasekhar Reddy : మేకపాటికి గుండె నొప్పి ? అత్యవసర చికిత్స! కాసేపటికే మీడియాతో..
తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు హుటాహుటిన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి సస్పెండైన తర్వాత బెంగళూరు వెళ్లిపోయిన ఆయన రెండు రోజుల క్రితం ఉదయగిరి తిరిగొచ్చారు. ఆలోపు పార్టీలో తన ప్రత్యర్ధులు విసురుతున్న సవాళ్లపై స్పందించిన ఆయన నిన్న ఉదయగిరి బస్టాండ్ సెంటర్ కు వచ్చి హల్ చల్ చేశారు.
నిన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన ప్రత్యర్ధి చేజర్ల సుబ్బారెడ్డి విసిరిన సవాల్ కు స్పందించి బస్టాండ్ సెంటర్ కు వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఉదయగిరి నుంచి తనను వెళ్లగొడతామంటూ సవాళ్లు విసిరిన వాళ్లు ఎక్కడ అని మేకపాటి ప్రశ్నించారు. గంటసేపు ఎదురుచూసి ఎవరూ రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రాత్రికి చేజర్ల సుబ్బారెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు బస్టాండ్ సెంటర్ కు వస్తానని, అక్కడికి రావాలని మేకపాటికి సవాల్ విసిరారు.

చేజర్ల సుబ్బారెడ్డి సవాల్ కు స్పందించి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ బస్టాండ్ సెంటర్ కు మరోసారి వస్తారని భావిస్తున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్ధతకు గురయ్యారు. ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వైద్యుల్ని రప్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన్ను మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు హార్ట్ అటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన.. తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.
గుండెనొప్పికి గురైన తర్వాత బీపీ, షుగర్, ఇతర పరీక్షలు చేయించుకున్న మేకపాటి మీడియాతో కూడా మాట్లాడారు. తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పలేనంటూ మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యం బాగుపడ్డాకే రాజకీయాలు చేస్తానన్నారు. సాయం చేసిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారని, అందరితో అన్ని రకాల ఫైట్లు చేసిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితోనూ కొట్లాడిన చరిత్ర తనకుందని, తనతో ఫైట్ చేసే ఆయన రాజకీయాల్లో రాణించారని, ఆయన ద్వారా తాను పైకి రాలేదన్నారు. ఇప్పుడు వైసీపీ గూండాల్ని ఆయన వెనకేసుకు తిరుగుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications