వాలంటీర్ల విలువ ఏంటో ప్రజలకు తెలియజేసినందుకు చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన వైసీపీ..!
AP Pensions: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- పింఛన్ల పంపిణీ వ్యవహారం ప్రచార అస్త్రంగా మారింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెడుతోంది. దీనిపై ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌పైనా ఎదురుదాడికి దిగుతోంది.
రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

అసెంబ్లీ, లోక్‌సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
దీనితో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని ఇవ్వడానికి బదులుగా సచివాలయం వద్ద ఆ మొత్తాన్ని పంపిణీ చేసే ఏర్పాట్లు తీసుకుంది. దీనికి అనుగుణంగా ఇంకాస్సేపట్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ ఆరంభం కానుంది.
తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను అందజేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. టీడీపీ మాజీ మంత్రులు, సీినియర్ నాయకులు సైతం నేరుగా జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడానికి గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించుకోవాలనేది వారి డిమాండ్. రాష్ట్రంలో 1.26 లక్షల మంది సచివాలయాల శాశ్వత ఉద్యోగులు ఉన్నవారని, వారితో పింఛన్లను పంపిణీ చేయాలంటూ పట్టుబట్టుతున్నారు టీడీపీ నాయకులు.

ఈ క్రమంలో చంద్రబాబు.. చేసిన ట్వీట్ల స్కీన్ షాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వాలంటీర్ల విలువ తెలియజేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్క సచివాలయాల ద్వారానే 1.26 మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పింది.
అయిదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క సచివాలయాల వ్యవస్ధ ద్వారానే 1.26 లక్షల ఉద్యోగాలు కల్పించామని పునరుద్ఘాటించింది వైసీపీ. అవ్వాతాతలు కిలో మీటర్లు ఎండలో నడిచి పెన్షన్ తీసుకునే కష్టం లేకుండా ఇంటి వద్దకే వచ్చి ఆ మొత్తాన్ని వలంటీర్లు అందించారని, వారికి కష్టం రాకుండా చూసుకున్నారని వివరించింది.
తాము 1.26 లక్షల మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను కల్పించడం, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని వచ్చామనే విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నారని.. ఇక టీడీపీ ఒప్పుకొంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత అంటూ కామెంట్స్‌ను పోస్ట్ చేసింది. చంద్రబాబును వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్‌గా అభివర్ణించింది.












Click it and Unblock the Notifications