AP Pensions: ఏపీలో పెన్షన్ల తొలగింపు-రీవెరిఫికేషన్ పై హైకోర్టుకు వైసీపీ..?
ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వాటిని అదే స్ధాయిలో ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ల మొత్తాన్ని పెంచినా వాటిలో కోతలు విధిస్తోంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్ల ఏరివేతకు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనిపై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.
రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికీ పంపి పింఛన్ లబ్దిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే 3.5 లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊరుకోబోమన్నారు. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని సుధాకర్‌బాబు హెచ్చరించారు.

దివ్యాంగులు, దురదృష్టవశాత్తు ప్రమాదమో, అనారోగ్యంతోనో బాధపడే వారిని జాలి, దయతో పింఛన్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పింఛన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారిపై పగ సాధిస్తున్నట్లుగా ఉందని సుధాకర్ బాబు విమర్శించారు. అర్హతే ప్రామాణికంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేం పింఛన్లు అందజేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ జన్మభూమి కమిటీల ద్వారా అందించే పాత విధానానికి కొత్త సంవత్సరంలో ప్రారంభించడం దారుణమన్నారు. ఇప్పటికే 3,53,227 మంది పింఛన్లు కోల్పోగా, ఇప్పుడు దివ్యాంగులు, అనారోగ్యంతో బాధ పడుతున్న పెన్షనర్లను టార్గెట్ చేశారన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నెలకు 66,34,742 పింఛన్లు పంపిణీ చేసిందని, 5 ఏళ్లలో పెన్షన్ల కింద రూ.92,547.66 కోట్లు ఠంచన్‌గా ఒకటో తేదీ రోజున తెల్లవారకముందే డోర్ డెలివరీ చేశామని సుధాకర్ బాబు తెలిపారు. 2019లో చంద్రబాబు దిగిపోయి వైఎస్ జగన్ సీఎం అయ్యేనాటికి ఇంచుమించుగా 39 లక్షల పింఛన్లు ఉండగా 2024లో జగన్ దిగిపోయే నాటికి ఆ సంఖ్య 66 లక్షలకు పెరిగిందన్నారు. వాటిలో ఈ ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం 3.5 లక్షల పెన్షన్లు కోత పెట్టిందన్నారు. ఇప్పుడు దివ్యాంగులు, అనారోగ్యంతో బాధ పడుతున్న పింఛన్ లబ్ధిదారుల రీవెరిఫికేషన్ చేపట్టి మరో కోతకు సిద్ధమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications