Vinukonda : వినుకొండలో వైసీపీ వర్సెస్ టీడీపీ-గాల్లోకి కాల్పులతో ఉద్రిక్తత..
ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి వ్యతిరేకంగా టీడీపీ ఇన్ ఛార్జ్ జీవీ ఆంజనేయులు చేస్తున్న పోరాటమే ఇందుకు కారణం. ఎమ్మెల్యే మైనింగ్ అక్రమాలపై టీడీపీ కార్యకర్తలు ఇవాళ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే ఎదురుపడటంతో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడులు చేసుకున్నారు.
Vinukonda : వినుకొండలో వైసీపీ వర్సెస్ టీడీపీ-గాల్లోకి కాల్పులతో ఉద్రిక్తత..!! pic.twitter.com/nt3Y4a2lSN
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
స్ధానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారీ ఎత్తున స్ధానిక కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వీరు ర్యాలీగా వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అటువైపుగా వచ్చారు. దీంతో వీరిద్దరూ ఎదురుపడ్డారు. టీడీపీ కార్యకర్తలు, నేతల్ని చూసిన బ్రహ్మనాయుడు కారు దిగి తనపై ఆరోపణలు నిరూపించాలని కోరారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

వైసీపీ ఎమ్మెల్యే సవాల్ పై టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. గనుల అక్రమ తవ్వకాలు చేపడున్నారంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని సూచించారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్దితులు తలెత్తాయి. పరిస్ధితిని చక్కదిద్దేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే లాఠీఛార్జ్ కూడా చేశారు.
ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే టీడీపీ నేత జీవీ ఆంజనేయులు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు ఎమ్మెల్యేను వదిలిపెట్టి తమ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమాలపై తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications