ఎన్నికల వేళ సీఎం జగన్ కు భారీ విజయం..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కు భారీ విజయం దక్కింది. ఫైనల్స్ రేసు ముంగిట సెమీస్ లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కు భారీ విజయం దక్కింది. ఫైనల్స్ రేసు ముంగిట సెమీస్ లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఇప్పటికే ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్థానాలను గెలుచుకుంది. దీంతో, ఎన్నికలు జరిగిన తొమ్మది ఎమ్మెల్సీ సీట్లు వైసీపీ ఖాతాలో చేరాయి. ఇక గ్రాడ్యుయేట్.. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతంది. సాయంత్రం తరువాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ ఎన్నిక వైసీపీ..టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

అన్ని స్థానాల్లోనూ వైసీపీదే గెలుపు
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నింటా వైసీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్ధి నర్తు రామారావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి పై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్ధికి 108 ఓట్లు రాగా, రెండు ఓట్లు చెల్లలేదు. దీంతో..వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూధన్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్దికి 988 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవగా.. 1083 ఓట్లు పరిగణలోకి తీసుకున్నారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులోనే వైసీపీ అభ్యర్ది మధుసూధన్ కు కావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ సంఖ్యలో పోల్ కావటంతో ఆయన విజయం సాధించారు.

పశ్చిమలో రెండు స్థానాల్లోనూ విజయం
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ రెండు స్థానాలను వైసీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్ కు 418 ఓట్లు రాగా, వంకా రవీంద్రకు 460 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి 122 ఓట్లు రాగా.. మోత్తం పోలైన ఓట్లు 1088 ఓట్లలో 25 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. స్థానిక సంస్థల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయితే, నాలుగు జిల్లాల్లో టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్దులు పోటీలో నిలిచారు. కానీ, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అన్ని స్థానాలు వైసీపీకే దక్కాయి. వీటితో పాటుగా గ్రాడ్యుయేట్.. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

పట్టభద్రుల నియోజకవర్గ ఫలితం పై ఉత్కంఠ
పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్నూలు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 49 మంది పోటీ చేస్తున్నారు. విశాఖ గ్రాడ్యుయేట్ స్థానంలో 37 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రకాశం నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ స్థానం నుంచి 22 మంది పోటీ పడుతున్నారు. విశాఖ ఫలితం మూడు ప్రధాన పార్టీల్లో ఉత్కంఠగా మారుతోంది. అక్కడ గెలుపు పైన బీజేపీ కూడా ఆశలు పెట్టుకుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఫలితం రాజకీయంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..వైసీపీ - టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపును సీరియస్ గా తీసుకున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖలు రాసారు. ఇక..పట్టభద్రుల నియోజకవర్గంలోనూ గెలుపు ఖాయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ వరుస విజయాలతో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ వైసీపీలో కొత్ జోష్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications