చంద్రబాబుపై వ్యాఖ్యల ఎఫెక్ట్- వైసీపీ అధికార ప్రతినిధికి షాక్..!
ఏపీలో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న బాపట్ల జిల్లా నేత కారుమూరు వెంకటరెడ్డిని పోలీసులు ఈ ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసులు ఆయన్ను సొంత నివాసంలోనే అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంపై వరుసగా సోషల్ మీడియాతో పాటు సాక్షి టీవీలో విమర్శలకు దిగుతున్న వెంకటరెడ్డిని అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజాగా టీటీడీ పరకామణిలో చోరీ వ్యవహారంపై కూటమి సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇదే కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురి కావడంపై వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే అంతకు ముందు జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం విషయంలోనూ సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వంపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ రెండు కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం.

వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రికి చెందిన టీడీపీ నేత ప్రసాదనాయుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసారు. దీని ఆధారంగా ఆయన్ను ఇవాళ హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న నివాసంలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే అరెస్టు సందర్భంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని, నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఫోన్లు లాక్కుని పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని వెంకటరెడ్డి భార్య ఆరోపించారు.
మరోవైపు వెంకటరెడ్డి అరెస్ట్ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు బాత్ రూమ్ లో హర్పిక్ డబ్బా పట్టుకుని వెంకటరెడ్డి బెదిరించినట్లు తెలుస్తోంది. "ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తారా ? 'నన్ను అరెస్ట్ చేస్తే హార్పిక్ తాగి పోతాను' నా చావుకు మిరే కారణం అని చెపుతాను" అంటు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. మీరు హార్పిక్ తాగినా హాస్పిటల్ కి తీసుకొనివెళ్లి ట్రిట్మింట్ చేయించి అరెస్ట్ చేస్తామని చెప్పి డబ్బా లాక్కుని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications