కల్తీ నెయ్యి కేసులో తొలి రాజకీయ అరెస్ట్, బిగ్ టర్న్ - నెక్స్ట్ ఇక..!!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేసారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే పలువురు నెయ్యి కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేసారు. సరఫరా పైన పూర్తి సమాచారం సేకరించారు. నాణ్యత నివేదికలను పరిశీలన చేసారు. కాగా.. ఇప్పుడు ఈ అరెస్ట్ తరువాత.. టీటీడీలో గతంలో కీలక హోదాలో పని చేసిన వ్యక్తి విచారణకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగం పెరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను సిట్ అరెస్టు చేసింది. రుయాలో వైద్య పరీక్షల అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించింది. ఇప్పటివరకూ ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి అరెస్ట్ ఇదే. చిన్న అప్పన్నది విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలస. హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తుంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పన్న పైన సిట్ పూర్తి సమాచారం సేకరించింది. గత జూన్ 4వ తేదీన చిన్న అప్పన్నను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి ఈ విషయంపై విచారించింది.

సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభం అయింది. ఆ వెంటనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణ నిమిత్తం దర్యాప్తు అధికారులు బుధవారం తిరుపతి సిట్ కార్యాలయానికి చిన్న అప్పన్నను పిలిపించారు. హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు విచారణలో పాల్గొన్నారు. విచారణ అనంతరం చిన్న అప్పన్నను అరెస్టు చేశారు. రిమాండు రిపోర్టులో అతడిని ఏ-24గా పేర్కొన్నారు. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక నుంచి ఈ కేసులో కీలక వ్యక్తుల విచారణలు.. అవసరానికి అనుగుణంగా అరెస్ట్ లు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications