మా ప్రభుత్వం కూల్చెయ్యాలని కొందరు చూస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కొన్ని పత్రికలు బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాయని టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న వై.వి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసిపి ప్రభుత్వం కూలిపోవడం కొందరు కోరుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు కూల్చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం పైన, దేవుళ్ళ పైన పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వై.వి సుబ్బారెడ్డి మండిపడ్డారు. విజయ్ కుమార్ స్వామిని లాబీయింగ్ కోసం సీఎం జగన్ నివాసానికి వచ్చినట్టుగా, పలు పత్రికల్లో తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని మండిపడిన ఆయన విజయ్ కుమార్ స్వామి విజయవాడ ఎవరి విమానంలో వచ్చారు? రామోజీరావు వియ్యంకుడి విమానంలోనే ఆయన వచ్చారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

రామోజీరావు బంధువు విశ్వేశ్వరరావు వచ్చిన విమానంలోనే విజయ్ కుమార్ స్వామి కూడా వచ్చారని, మార్గదర్శి కేసు నుంచి బయటపడడం కోసమే విజయ్ కుమార్ స్వామికి రామోజీరావు తెచ్చుకున్నారంటూ వై.వి సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. విజయ్ కుమార్ స్వామి రావడంతో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు పనిగట్టుకుని కక్షపూరితమైన రాతలు రాస్తున్నాయని వై.వి.సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
2007 నుంచి తనకు విజయ్ కుమార్ స్వామి తెలుసని, ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించటానికి వచ్చారని పేర్కొన్నారు. ఆయన లాబీయింగ్ చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. ఎంతో మంది స్వామిజీలు నిత్యం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఉంటారని, దీనిని లాబీయింగ్ అనడం సరికాదని వై.వి సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

టిటిడిపై లేనిపోని విమర్శలు కూడా చేస్తున్నారని మండిపడిన ఆయన, స్వామీజీలు, దేవుళ్ల విషయంలో రాజకీయ లబ్దికోసం నీచ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. అంతేకాదు వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ పక్షపాత ధోరణిలో జరుగుతుందని, విచారణ వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా ఉండకూడదని వై.వి.సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని తాము భావిస్తున్నట్లు వై.వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications