ప్రైవేటు రంగంలో 100 శాతం రిజర్వేషన్లు!: కర్ణాటక సర్కారుకు నిరసన సెగ
ప్రైవేటు రంగంలో కూడా 100 శాతం స్థానికులకే రిజర్వేషన్ అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేసిన ట్వీట్, సర్కారు నిర్ణయం ఆ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతోంది. గత సోమవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్ ఆ రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేటు పరిశ్రమల్లో సి, డి గ్రేడ్ పోస్టులను వందశాతం కన్నడిగులకే ఇవ్వాలనే బిల్లును ఆమోదించినట్లు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
కర్ణాటక వాసులు సుఖవంతమైన జీవనం గడిపేందుకు అవకాశం కల్పించాలని, ఈ గడ్డపై ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. కన్నడిగుల సంక్షేమమే తమ ప్రాధాన్యమని చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై పారిశ్రామిక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో ఆ పోస్టును సిద్ధరామయ్య తాజాగా తొలగించారు.

వివరణ ఇచ్చారు కానీ..
ఈ క్రమంలో మరో ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ విషయంపై కర్ణాటక కార్మిక శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 70 శాతం, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో 50 శాతం పోస్టులను మాత్రమే కన్నడిగులకు కేటాయించాలని తాము చెప్పినట్లు వెల్లడించింది.
కాగా, న్యాయశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు పరిశ్రమల్లో లోకల్ కోటా రిజర్వేషన్లు పొందాలంటే అభ్యర్థులు కన్నడ ఒక భాషగా కలిగిన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అది లేకపోతే కన్నడ భాషలో తమకు ప్రావీణ్యత ఉందని సంబంధిత నోడల్ ఏజెన్సీ నిర్వహించే ప్రావీణ్యత పరీక్షలో పాస్ కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు లేకపోతే ప్రభుత్వ సహకారం లేదా ఏజెన్సీల సహకారంతో అభ్యర్థులకు ప్రైవేటు పరిశ్రమలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు రూ. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కూడా తప్పు పునరావృతమైతే రోజుకు వంద రూపాయల చొప్పున పెనాల్టీ విధించడం జరుగుతుంది.
పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత: నాస్కామ్ హెచ్చరిక
ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక సర్కారు తీసుకున్న నిర్ణయంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజా నిర్ణయంపై పునరాలోచించాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (NASSCOM) కోరింది. ఇలాంటి ఆంక్షలు విధిస్తే.. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సాఫ్ట్‌వేర్ కంపెనీలు తరలివెళ్లడానికి దారితీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ సంస్థలు కూడా ముందుకు రావని పేర్కొంది.
కర్ణాటక కేబినెట్ నిర్ణయంపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు కర్ణాటక నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించారు. ఇలాంటి చర్యల కంటే స్థానికులకు నైపుణ్యాలు మెరుగుపరిచే దిశగా కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ బిల్లు పూర్తి వివక్షపూరితమైనదని, దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇలాంటి ఒక బిల్లును తీసుకొస్తుందంటే నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లోని రిక్రూట్‌మెంట్ బోర్డులో ప్రభుత్వ అధికారి కూర్చుంటారా? ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుంది అని మోహన్ దాస్ నిలదీశారు.
మరోవైపు, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని ఆమె సూచించారు. అధిక నైపుణ్యం ఉన్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం ఉందని, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం కూడా తమ ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications