కుప్పకూలిన భవనం- పలువురు దుర్మరణం?
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాల వల్ల సగం నీట మునిగిందీ సిలికాన్ సిటీ. ఇప్పుడు తాజాగా దానా తుఫాన్ ప్రభావంతో మరోసారి కుంభవృష్టి సంభవించే అవకాశం లేకపోలేదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దీనికి అనుగుణంగా బెంగళూరులో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ప్రత్యేకించి- బెంగళూరు దక్షిణ ప్రాంతంలో అనేక కాలనీలు నీట మునిగాయి. అపార్ట్‌మెంట్లల్లో వరద నీరు పోటెత్తింది. ఈ ఉదయం వర్షం పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు గానీ అది ఎంతో సేపు నిలవలేదు. మధ్యాహ్నానికి మళ్లీ దట్టంగా మేఘాలు అలముకున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది.

సోమవారం సాయంత్రం బెంగళూరులో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన అతి భారీ వర్షం తెల్లవారేంత వరకూ కురిసింది. దీని దెబ్బకు బెంగళూరు దక్షిణ ప్రాంతంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరదనీరు ప్రవహించింది. అనేక నివాసాలు నీట మునిగాయి.
యలహంకలోని కేంద్రీయ సదన్‌లో మళ్లీ మునిగింది. సెల్లార్ సహా ఆవరణలో నిలిపివుంచిన వాహనాలు సగం వరకు మునిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నివసిస్తోన్న వారిని కాపాడటానికి రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. పడవల సహకారంతో వారిని బయటికి తీసుకొచ్చారు. వయోధిక వృద్ధులను భుజాలపై ఎత్తుకుని తీసుకుని రావడం కనిపించింది.

అత్యధిక వర్షపాతం బెంగళూరు రూరల్ జిల్లా వెంకటగిరి కోటెలో నమోదైంది. ఇక్కడ 150 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. గొట్టిగెరె, చౌడేశ్వరి, యలహంక న్యూ టౌన్, యలహంక ఓల్డ్ టౌన్, భాగలూరు, కట్టిగెనహళ్లి, హెబ్బాళ, సహకారనగర, విద్యారణ్యపుర, ఎంఎస్ పాళ్య, టాటానగర్, బ్యాటరాయనపుర, అమృతహళ్లి, జక్కూరు వంటి ప్రాంతాల్లో ఈ వర్షాల తీవ్రత అధికంగా పడింది.
ఈ వర్షాల ధాటికి హెన్నూరు సమీపంలోని బాబుసాపాళ్య, అంజనాద్రి లే- అవుట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారిలో ఇప్పటివరకు ఆరుమందిని వెలికి తీశారు. నలుగురు మృతి చెందినట్లు సమాచారం అందింది. దీన్ని ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
An under-construction building in the #Babusapalya area has collapsed, with three workers successfully rescued so far. According to police reports, there are concerns that 10 to 12 additional workers may still be trapped inside the debris.#Bengaluru #building pic.twitter.com/RKEPnvoJbj
— Madhuri Adnal (@madhuriadnal) October 22, 2024
భవన నిర్మాణ కార్మికుల్లో కొందరు అక్కడే నివసిస్తోన్నారు. భారీ వర్షం పడుతుండటం వల్ల ఆ మార్గంలో వెళ్తోన్న కొందరు పాదాచారులు, వాహనదారులు కూడా అక్కడే నిల్చున్నారు. ఈ సాయంత్రం 5 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలింది. ఆ సమయంలో 17 మంది వరకు అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.
సమాచారం అందిన వెంటనే స్థానిక శాసన సభ్యుడు బైరాతి సురేష్, పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల నుంచి ఇప్పటివరకు ఆరుమందిని వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications