బొమ్మైను పక్కన పెట్టుకుని బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన సుదీప్- ఐటీ దాడులకు భయపడను
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్.. భారతీయ జనతా పార్టీలో చేరబోతోన్నారంటూ వచ్చిన వార్తలకు తెర పడింది. సుదీప్- స్వయంగా దీనికి తెరదించారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరట్లేదంటూ ప్రకటించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పక్కన ఉండగానే ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కొద్దిసేపటి కిందటే బెంగళూరులోని అశోకా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో- బసవరాజ్ బొమ్మై, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్‌తో కలిసి సుదీప్.. మాట్లాడారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ ప్రెస్‌మీట్‌లో ఎక్కడే గానీ సుదీప్ బీజేపీ పేరే ఎత్తలేదు. తాను ఏ పార్టీలో కూడా చేరట్లేదని స్పష్టం చేశారు. అసలు రాజకీయాల్లో ప్రవేశించదలచుకోలేదనీ తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా తాను బసవరాజ్ బొమ్మై అభిమానినని, ఆయనకు మాత్రమే తాను మద్దతు ఇస్తోన్నానని వివరించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బొమ్మై తరఫున తాను ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. ఏ నియోజకవర్గానికి పంపిస్తే అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తానని, అంతే తప్ప ఏ పార్టీకీ మద్దతు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. బొమ్మైను తాను చిన్నప్పటి నుంచీ చూస్తోన్నానని, ఆయనను వ్యక్తిగతంగా తాను అంకుల్ అని పిలుస్తానని చెప్పారు. ఆ గౌరవభావంతోనే తాను బొమ్మై తరఫున ప్రచారం చేయనున్నట్లు సుదీప్ తెలిపారు.
ఆదాయపు పన్ను అధికారుల దాడులకు భయపడి లేదా ఇంకేదైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఈ నిర్ణయం తీసుకున్నారా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ఒత్తిళ్లకు భయపడే వాడిలా కనిపిస్తున్నానా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఐటీ దాడులకు లేదా ఇతర ఒత్తిళ్లకు తాను లొంగేవాడిని కాదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తోన్నందుకు బీజేపీ తరఫున డబ్బులు తీసుకుంటున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు కూడా ఆయన ఎదురు ప్రశ్నే వేశారు.
చిత్ర పరిశ్రమ నుంచి తనకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయని, తనతో సినిమాలు తీసిన నిర్మాతలు రెమ్యునరేషన్లు ఇవ్వాల్సి ఉందని సుదీప్ అన్నారు. ఆ డబ్బులు వస్తే చాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తాను బొమ్మైని చూసే ప్రచారం చేయదలిచానని అన్నారు. బొమ్మై ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు మద్దతు ఇచ్చేవాడినేనని తేల్చి చెప్పారు.
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నటుడు సుదీప్. రాష్ట్రంలో గల అన్ని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సుదీప్‌తో ఎన్నికల ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తోంది. రాయచూర్ రూరల్, మాస్కి, షోరాపూర్, మాన్వి, దేవదుర్గ, కంప్లి, సిరిగుప్ప, బళ్లారి, సండూర్, కుడ్లిగి, చెల్లకెరె, మొలకల్మూర్.. వంటి నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున ఎస్టీ సామాజిక వర్గానికే చెందిన సుదీప్ ను ఎన్నికల ప్రచార బరిలో దించడం వల్ల పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని బీజేపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications