నీకు సిగ్గుంటే..: హోం మంత్రిపై సొంత పార్టీ ఎమ్మెల్సీ నిప్పులు
బెంగళూరు: మఠాధిపతిపై అత్యాచార ఆరోపణల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చిచ్చు పెట్టింది. మఠాధిపతిపై చట్టపరమైన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడుతోందంటూ సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. లింగాయత్ ఓటుబ్యాంక్ కోసమే నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ భగ్గుమంటోన్నారు.

విచారణను ఎదుర్కొంటా..
కనకపురలోని మురుళగవి మఠాధిపతి ముమ్మడి శివమూర్తి మురుఘ శరణారు అత్యాచర ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఓ మైనర్ బాలికను ఆయన లైంగికంగా వేధించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఆయనపై చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదైన వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఒక రోజు తరువాత మళ్లీ తన మఠానికి చేరుకున్నారు. తాను నిర్దోషినని, తాను ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడలేదని చెప్పారు. విచారణను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్సీ
శివమూర్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయకపోవడం పట్ల అటు బీజేపీకే చెందిన సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు హెచ్ విశ్వనాథ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం శాఖ మంత్రి అరగ జ్ఞానేంద్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ కేసు విషయంలో కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతి కావడం వల్లే ఆయనపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని ధ్వజమెత్తారు.

కేసు నీరుగార్చాంరంటూ..
మురుళగవి మఠంలో తాము లైంగిక వేధింపులకు గురైనట్లు ఇద్దరు బాలికలు మైసూరులోని ఓ ప్రభుత్వేతర సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారి ఫిర్యాదు మేరకు మఠం హాస్టల్ వార్డెన్ సహా అయిదుమందిపై మైసూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం చిత్రదుర్గకు ఈ కేసు బదిలీ అయింది. అక్కడ ఈ కేసు నీరుగారిందంటూ విశ్వనాథ ఆరోపించారు. చిత్రదుర్గ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మోదీకి లేఖ రాస్తా..
మైనర్ బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతూ తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని, అన్ని అంశాలను ఇందులో పొందుపరుస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులెవరూ ఈ అంశంపై పెదవి విప్పడం లేదని, దీనికి కారణం మఠాధిపతి సామాజిక వర్గమేనని అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా చూస్తున్నారని, ఈ అంశంపై మాట్లాడితే ఓట్లు పోతాయనే భయం పార్టీలకు ఉందని ఆరోపించారు. అంతా ఓటు బ్యాంకు రాజకీయాలేనని చెప్పారు.

ఓటుబ్యాంక్ కోసం..
అన్యాయానికి గురైన మైనర్ బాలికల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని, ఓట్ల కోసం, మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి అండగా నిలిచేలా ప్రభుత్వ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నిందితుడు మఠాధిపతి పదవి నుంచి తాత్కాలికంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. ఆయనపై పోక్సో కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిందితుడు జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత మరింత గౌరవం లభిస్తుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications