మహిళలకు ప్రతి నెలా రూ.2,000 నగదు..!!
బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇది. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కూడా ఇదే. అధికారాన్ని నిలుపుకోవడానికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి రావడానికి అవసరమైన హామీలు, వాగ్దానాలను గుప్పిస్తోంది.

బీజేపీ పర్యటనల హోరు..
ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో పర్యటించారు. హుబ్బళ్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆ తరువాత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ నెలాఖరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కర్ణాటకలో పర్యటించనున్నారు. బహిరంగ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం..
కాంగ్రెస్ కూడా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గె సొంత రాష్ట్రం కావడం వల్ల ఈ అసెంబ్లీ ఎన్నికలను పార్టీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తీరడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా- ఇవ్వాళ బెంగళూరుకు వచ్చారు. ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

ప్రతి నెలా రూ.2,000
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సభలో ప్రియాంకా గాంధీ వాద్రా కీలక వాగ్దానాలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే- గృహిణులందరికీ ప్రతినెలా 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు ప్రియాంక గాంధీ వాద్రా.

50 శాతం మహిళలే..
రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని, వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చనున్నట్లు ప్రియాంకా గాంధీ చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కూడా సిద్ధం చేయాలని కూడా నిర్ణయించామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధికశాతం టికెట్లను ఇవ్వాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించామని అన్నారు.

పరిస్థితులు దారుణం..
బీజేపీ పాలనలో కర్ణాటకలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రభుత్వ పెద్దలే పెద్ద ఎత్తు అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దీనివల్ల 1.5 లక్షల కోట్ల రూపాయలు బీజేపీ నాయకుల జేబుల్లోకి వెళ్లాయని మండిపడ్డారు. పీఎస్ఐ కుంభకోణం సిగ్గుచేటు అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications