బెంగళూరులో ‘అద్దె’ గదులు కావాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే!
సాఫ్ట్‌వేర్ సిటీ బెంగళూరులో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది అద్దెకు ఇల్లు దొరకడమే. అద్దెకు ఇల్లు దొరికినా.. ఆ అద్దె, అందుకు డిపాజిట్ చేసే మొత్తం చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మేస్తాయి.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజధాని, సాఫ్ట్‌వేర్ సిటీ బెంగళూరులో అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది అద్దెకు ఇల్లు దొరకడమే. అద్దెకు ఇల్లు దొరికినా.. ఆ అద్దె, అందుకు డిపాజిట్ చేసే మొత్తం చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్మేస్తాయి. తాజాగా, బెంగళూరులో అద్దె సామాన్యులకు భారంగా మారిందనేందుకు ఉదాహరణగా కొన్ని పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

అద్దె కోసం లెఫ్ట్ కిడ్నీ అమ్మేస్తానంటూ పోస్టర్లు
ఓ వ్యక్తి తాను బెంగళూరులోని ఇందిరానగర్‌లో అద్దెకు తీసుకునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేందుకు సిద్ధమయ్యాడు. తాను తన లెఫ్ట్ కిడ్నీని అమ్మేందుకు సిద్ధమని, కొనేవారుంటే సంప్రదించాలంటూ కొన్ని పోస్టర్లను నగరంలో అంటించాడు. బెంగళూరులో అద్దె కంటే డిపాజిట్ మొత్తం భారీగా ఉంటుందని, అంత మొత్తం తాను కట్టలేనని వాపోయాడు.

అక్కడ అద్దె భారీ మొత్తంలో.. క్యూఆర్ కోడ్‍తో పోస్టర్లు
ఈ క్రమంలోనే తాను తన కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. ఆ పోస్టర్లలో తనకు సంబంధించిన వివరాలతో ఓ క్యూఆర్ కోడ్ ను కూడా పొందుపర్చాడు. బెంగళూరులోని ఇందిరానగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకోవడం కోసం తాను తన కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. తనకు మరో దారి కనిపించడం లేదని వాపోయాడు.

అద్దె కోసం కిడ్నీ విక్రయం పోస్టర్లు వైరల్
కాగా, ఈ పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందిరానగర్ ఏమైనా స్వర్గమా? అక్కడే తీసుకోవాలా? కొందరు ప్రశ్నిస్తున్నారు. అద్దె డిపాజిట్ కోసం ఎడమ కిడ్నీ అమ్ముతున్నారు.. మరి కుడి కిడ్నీ బ్రోకరేజీ కోసం విక్రయిస్తారా? అని ఇంకో నెడిజన్ వ్యాఖ్యానించాడు.

బెంగళూరులో అద్దె డిపాజిట్లు రూ. 50 వేల నుంచి లక్షపైనే..
అయితే, ఏది ఎలా ఉన్నా.. బెంగళూరు నగరంలో మాత్రం అద్దె డిపాజిట్లు మాత్రం అద్దెకు గదులు తీసుకునేవారికి చుక్కలు చూపిస్తున్నాయి. సింగిల్ లేదా డబుల్ బెడ్ రూం ఇల్లు తీసుకోవాలనుకున్నా.. డిపాజిట్‌గా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుండటం గమనార్హం. దీంతో ఈ మొత్తం సామాన్యులకు భారంగానే మారుతోంది. ఎక్కువ జీతాలు పొందేవారు ఈ మొత్తాన్ని భరించే అవకాశం ఉన్నప్పటికీ.. సాధారణ జీతాలు పొందేవారి పరిస్థితి మాత్రం కష్టంగానే ఉంటోంది.












Click it and Unblock the Notifications