ఊహించలేదు, కానీ, నా సామర్థ్యంపై నమ్మకం ఉంది: కర్ణాటక సీఎం పదవిపై బసవరాజ్ బొమ్మై స్పందన
బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప రాజీనామా అనంతరం కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మైని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. కర్ణాటకలో ఓటర్లలో అత్యధిక ప్రాబల్యం కలిగిన లింగాయత్ సామాజిక వర్గానికే మళ్లీ సీఎం పీఠాన్ని అప్పగిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Recommended Video
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఊహించలేదని చెప్పారు. అయితే, తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉందని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని బసవరాజ్ తెలిపారు.

కాగా, బసవరాజ్ ఎంపికపై బీజేపీలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లుసమాచారం. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో కొత్త సీఎంను ఎంపిక చేశారు. ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా కొనసాగుతున్న బసవరాజ్ బొమ్మై.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.
అంతేగాక, మాజీ సీఎం యడ్యూరప్పకు కూడా అత్యంత సన్నిహితుడిగా బసవరాజ్‌కు పేరుంది. దీంతోనే బసవరాజ్ పేరును యడ్యూరప్ప సమర్థించినట్లు తెలుస్తోంది. బసవరాజ్ బొమ్మై ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిల్‌కు కర్ణాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, బుధవారం జరిగే బసవరాజ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి యడ్యూరప్పతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.
గత కొద్ది రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలు మంగళవారంతో తెరపడింది. ప్రభుత్వంలో, పార్టీలో యడ్యూరప్ప కుమారుడి జోక్యం పెరుగుతుండటం, అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానంగా అనివార్యంగా ముఖ్యమంత్రిని మార్చినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి మాత్రమే మారారని, పాలించే పార్టీ మాత్రం బీజేపీనేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications