Puneeth Rajkumar: శాండల్‌వుడ్‌కు శాపమా?: రెండేళ్లల్లో ముగ్గురు స్టార్ హీరోలు కన్నుమూత
బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర చికిత్స అందించినా..
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికే.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంచినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయన మరణంతో శాండల్‌వుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమ పెద్దల దుఖ్ఖం కట్టలు తెంచుకుంది. తోటి నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు దిగ్బ్రాంతికి గురి అయ్యారు.

సినిమా థియేటర్లు బంద్..
పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణానికి రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఫిట్ అండ్ ఫైన్, ఎనర్జిటిక్ శరీర ధారుడ్యాన్ని కలిగి ఉండే పునీత్‌కు గుండెపోటు రావడం ఏమిటంటూ ఉలిక్కిపడ్డారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా కన్నడ చలన చిత్ర పరిశ్రమ.. సినిమాల షూటింగ్‌ను నిలిపివేసింది. ఎగ్జిబిటర్ల.. రాష్ట్రం మొత్తం సినిమా థియేటర్లను మూసివేశారు. పలు చోట్ల పునీత్ ఫొటోలకు పూలమాలలు వేసి, నివాళి అర్పిస్తున్నారు.

రెండేళ్లల్లో ముగ్గురు హీరోలు..
శాండల్‌వుడ్‌కు నిజంగానే ఇదొక శాపంగా భావించే సందర్భంగా అభివర్ణిస్తున్నారు అభిమానులు. వరుసగా రెండు సంవత్సరాల్లో చందనసీమ ముగ్గురు స్టార్ హీరోలను కోల్పోయింది. గత ఏడాది చిరంజీవి సర్జా.. ఇదే తరహాలో గుండెపోటుకు గురయ్యారు. బన్నేరుఘట్టలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు చిరంజీవి సర్జా. ప్రముఖ నటి మేఘనా రాజ్‌ను ఆయన వివాహం చేసుకున్నారు.

ఈ ఏడాదే ఇద్దరు..
ఆ మరుసటి సంవత్సరమే ఇద్దరు స్టార్ హీరోలు కన్నుమూయడం శాండల్‌వుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదివరకు సంచారి విజయ్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంచారి విజయ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 15వ తేదీన ఆయన మరణించారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి శాండల్‌వుడ్ కోలుకోవట్లేదు. అంతలోనే మాస్ హీరో ఇమేజ్, యూత్‌లో క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూయడాన్ని చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.

ఇంటి వద్ద వేలాదిగా అభిమానులు..
ప్రస్తుతం పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహం.. విక్రమ్ ఆసుపత్రిలోనే ఉంది. ఆయనను పరామర్శించడానికి వచ్చిన ప్రముఖులు అందరూ ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఆయన అన్న శివరాజ్ కుమార్, సోదరి, భార్య అశ్విని రేవంత్.. ఇతర సినిమా ప్రముఖులు ఇంటికి వెళ్లారు. బెంగళూరులోని పునీత్ రాజ్‌కుమార్ నివాసం జనసంద్రమైంది. వేలాదిమంది అభిమానులు ఆయన ఇంటివద్ద శోకతప్త హృదయాలతో బారులు తీరి నిల్చున్నారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications