Puneeth Rajkumar: నేత్రదానం: ఎల్లుండి అంత్యక్రియలు: కంఠీరవ స్టేడియంలో కడసారి చూపు
బెంగళూరు: శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్‌కుమార్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు ఆయనకు గుండెపోటు సంభవించింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.

అత్యవసర చికిత్స అందించినా..
ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికే.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన పరిస్థితి విషమంచినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయన మరణంతో శాండల్‌వుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. చిత్ర పరిశ్రమ పెద్దల దుఖ్ఖం కట్టలు తెంచుకుంది. తోటి నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు దిగ్బ్రాంతికి గురి అయ్యారు.

చూడలేనంటూ..
పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచిన విక్రమ్ ఆసుపత్రిలో.. ఆయన పార్థివ దేహం నుంచి కళ్లను స్వీకరించారు. ఇదివరకే ఆయన నేత్రదానికి అంగీకరించారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ధృవీకరించిన కొద్దిసేపటికే- ఆపరేషన్ చేశారు. కళ్లను డొనేట్ చేశారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఆయన కుటుంబీకులు ఎవరూ లేరు. ఆపరేషన్ చేయాల్సి ఉంటుందంటూ డాక్టర్లు సమాచారం ఇచ్చిన వెంటనే- దాన్ని చూడలేనంటూ శివరాజ్ కుమార్, భార్య అశ్విని రేవంత్, సోదరి.. ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి వెళ్లారు.

ఇంటికి పార్థివకాయం..
విక్రమ్ ఆసుపత్రి నుంచి పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని సదాశివ నగరలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ బయలుదేరినప్పటి నుంచీ వేలాదిమంది అభిమానులు అంబులెన్స్‌ను అనుసరించారు. ద్విచక్రవాహనాలు, ఆటోల్లో అంబులెన్స్ వెంట సాగారు. సదాశివ నగరలోని నివాసానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల చివరిసారి చూపు కోసం అక్కడికి తీసుకెళ్లారు.

కంఠీరవ స్టేడియానికి
ఈ సాయంత్రం 5 లేదా 6 గంటల తరువాత పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియానికి తీసుకెళ్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి బెంగళూరుకు వచ్చే లక్షలాది మంది అభిమానులు చివరిసారి వీడ్కోలు పలకడానికి, కడసారి చూపు కోసం ఈ ఏర్పాటు చేశారు. కంఠీరవ స్టేడియానికి ఈ సాయంత్రానికే తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా- అంత్యక్రియలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు అంత్యక్రియలను జరుపుతారని తెలుస్తోంది.

జర్మనీలో కుమార్తె..
పునీత్ రాజ్‌కుమార్-అశ్విని రేవంత్ దంపతులకు వందన, ధృతి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు జర్మనీలో చదువుకుంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుమార్తె జర్మనీ నుంచి బయలుదేరారు. ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుందని చెబుతునన్నారు. అప్పటిదాకా పునీత్ పార్థివ దేహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంత్యక్రియలు జరపబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయమే అంత్యక్రియలు చేపడతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications