బీజేపీకి బిగ్ లాస్- సర్దుకుంటోన్న సీనియర్లు: సెకెండ్ క్యాడర్ ఖాళీ..!!
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు. తన అనుచరులతో సహా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
బెంగళూరు: అధికార భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తొమ్మిది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బలను చవి చూస్తోంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే ఈ ఎన్నికల్లో పరిస్థితులు పెద్దగా అనుకూలించేలా కనిపించట్లేదు. పార్టీ అధికారంలోకి రాదని ముందుగానే అంచనాలను వేసుకున్న సీనియర్లు ఒక్కొక్కరుగా సర్దుకుంటోన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

తెలంగాణ సహా..
ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. త్రిపురలో పోలింగ్ కూడా పూర్తయింది. ఈ నెల 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. . మిగిలిన కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లల్లో ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.

కర్ణాటకలో కీలకం..
పొరుగునే ఉన్న కర్ణాటకలో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ లల్లో పోలింగ్ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మే నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) మధ్య ముక్కోణపు పోటీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి కూడా- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

బీజేపీ మాజీ మంత్రి..
ఈ పరిణామాల మధ్య బీజేపీ సీనియర్ నాయకుడు హెచ్ డీ తమ్మయ్య.. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చిక్ మగళూరుకు చెందిన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నాయకుడాయన. బీజేపీ సీనియర్ నాయకులు, తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగళూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

బీజేపీ బుజ్జగించినా..
బలమైన సామాజిక వర్గానికి చెందిన హెచ్ డీ తమ్మయ్య- కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారనే సమాచారం తెలిసిన తరువాత ఆయనను బీజేపీ సీనియర్ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి సీటీ రవి రంగంలోకి దిగారు. అయినా ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. బీజేపీ ప్రభుత్వంలో లింగాయత్ సామాజిక వర్గానికి ఒరిగిందేమీ లేదని తమ్మయ్య బహిరంగంగానే విమర్శించారు. ఈ సారి కూడా గెలిచే అవకాశాలు లేవని తేల్చి చెప్పారు.

ఇంకా చాలామంది..
ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు స్వచ్ఛందంగా తనను కలిశారని, వారంతా కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చిక్ మగళూరు జిల్లా నుంచి 12 మంది బీజేపీ సభ్యులు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, తాము ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోన్నామని అన్నారు. బీజేపీ నాయకులు బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలను విస్మరించారని, వారిని తాము ప్రోత్సహిస్తామని అన్నారు.

మాజీ మంత్రి కూడా..
బీజేపీ మాజీ మంత్రి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్ నగేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముళబాగల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి సారథ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)- కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. బీఎస్ యడియూరప్ప ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగారు. ఎక్స్సైజ్ శాఖను పర్యవేక్షించారు. అనంతరం చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కోల్పోయారు.












Click it and Unblock the Notifications