సిద్దరామయ్య మోసం చేస్తున్నారని మండిపడిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిందే ఇప్పుడు చేస్తున్నారా ? అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పెడుతున్న కండిషన్స్ చూస్తుంటే ప్రకటించిన హామీలు అటక ఎక్కుతాయని ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో ప్రకటించిన విధంగా 200 యూనిట్ల విద్యుత్ ఎందుకు ఉచితంగా ఇవ్వడం లేదని సీఎం సిద్దరామయ్యను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, అహంకారంతో మాట్లాడితే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

దేశంలో నేడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే అని, కర్ణాటక రాష్ట్రంలో ఉచిత వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఇంటికి ఉచితంగా విద్యుత్ ఇస్తానంటూ అహంకారంతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, అహంభావంతో మాట్లాడటం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
అన్నభాగ్య యోజనలో 10 కిలోలు. అన్నం ఇస్తానని సిద్ధరామయ్య అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు బీపీఎల్ కార్డుదారులకు బియ్యం ఇస్తున్నారు. కేంద్రం ఇచ్చే 5 కిలోల బియ్యం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోలు ఇస్తుందా? దీనిపై సీఎం సిద్దరామయ్య ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన 5 కిలోలు బియ్యంతో సహా 10 కిలోల బియ్యం కాంగ్రెస్ పార్టీ ఎలా ఇస్తుందో చెప్పాలని ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
గృహలక్ష్మి యోజనలో రూ. 2, 000 రూపాయలు ఇవ్వడానికి దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్ ఇప్పుడు చెబుతోంది. ఈ విషయాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలకు ఎందుకు చెప్పలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.
తొలి కేబినెట్ లోనే అమలు చేస్తామని చెప్పిన వారే ఇప్పుడు ఆగస్ట్ నుంచి కాలయాపన చేసి పథకాలు అటక ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారంలోకి వచ్చాము ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారని, ప్రజలు తిరగబడితే అప్పుడు వాళ్లకు తగిన గుణపాఠం ఎదురౌతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.












Click it and Unblock the Notifications