ఎల్పీజీ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. గ్యాస్ సబ్సిడీ లెక్క మారుతోంది!
ఎల్పీజీ వినియోగదారులకు చేదువార్త. దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లెక్కలు త్వరలో మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు పశ్చిమాసియా( సౌదీ అరేబియా) ధరల ఆధారంగా నిర్ణయించే ఎల్పీజీ ధరలు, ఇకపై అమెరికా ధరల ప్రభావానికి లోనుకానున్నాయి. ప్రభుత్వం దీనిపై తీవ్రంగా ఆలోచిస్తున్నాట్లు సమాచారం.
అసలు విషయం ఏమిటంటే?
ప్రస్తుతం ఇండియా తన ఎల్పీజీ అవసరాలలో 60 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటివరకు గ్యాస్ ధరలను 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్' (Saudi CP) ఆధారంగా నిర్ణయించేవారు. కానీ గత నెలలో ప్రభుత్వ చమురు సంస్థలైన IOC, BPCL, HPCL అమెరికా కంపెనీలతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2026 నాటికి ఏడాదికి 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను అమెరికా నుండి దిగుమతి చేసుకోనున్నారు.

అమెరికా గ్యాస్ ఎందుకు ఖరీదు?
అగ్రరాజ్యం అమెరికా నుంచి గ్యాస్‌ను భారత్‌కు తరలించడం చాలా వ్యయంతో కూడుకున్న పని కావడం గమనార్హం. సౌదీ అరేబియా నుంచి వచ్చే గ్యాస్ రవాణా ఛార్జీల కంటే అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అమెరికా నుంచి వచ్చే గ్యాస్ రవాణా ఛార్జీలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పెరిగిన రవాణా ఖర్చులను కూడా ఎల్పీజీ ధరల లెక్కింపులో చేర్చాలని చమురు సంస్థలు కోరుతున్నాయి.
సబ్సిడీపై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రభుత్వ చమురు సంస్థలు గ్యాస్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మినప్పుడు, ఆ నష్టాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే ఖరీదైన గ్యాస్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, సబ్సిడీ లెక్కింపు విధానం మొత్తం మారుతుంది. కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరగవచ్చు లేదా వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది.
ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయి?
ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 853గా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ ద్వారా లభిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ. 1580.50గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. జనవరి 1 నుంచి కొత్త ధరలు వచ్చే అవకాశం ఉండటంతో, ప్రభుత్వం అమెరికా దిగుమతుల భారాన్ని సామాన్యులపై వేస్తుందా లేదా తానే భరిస్తుందా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications