ఛార్జీల మోత! 40 శాతం పెరిగిన రేట్లు, ప్రయాణికులకు చుక్కలు.
ఆటో ప్రయాణం సామాన్యులకు గుదిబండగా మారుతోంది. ఒకవైపు ఎల్‌పీజీ ధరల పెరుగుదలతో కనీస ఛార్జీలను పెంచాలని ఆటో సంఘాలు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు యాప్ ఆధారిత సంస్థలు (రైడ్ అగ్రిగేటర్లు) అప్పుడే ధరలను భారీగా పెంచేయడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.
బెంగళూరు నగరంలోని ఆటో అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లు సాధారణ ధరల కంటే 30 నుండి 40 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. గతంలో 9 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.170 ఖర్చయ్యే చోట, ఇప్పుడు ఏకంగా రూ.250 కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఉదాహరణకు, గత మంగళవారం సాయంత్రం 9 కిలోమీటర్ల దూరానికి రాపిడోలో రూ.263, ఓలాలో రూ.217, ఉబెర్‌లో రూ.220. నమ్మ యాత్రిలో రూ.204 ఛార్జీలు చూపించడం గమనార్హం. ఎంజీ రోడ్ నుండి ఆర్‌టీ నగర్‌కు సైతం సాధారణ ధరల కంటే రూ.50 నుండి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అగ్రిగేటర్ల వాదన ఏంటి?
భారీ ధరల పెంపుపై వస్తున్న ఆరోపణలను రాపిడో సంస్థ ఖండించింది. కిలోమీటర్‌కు కేవలం 5 శాతం మాత్రమే ధర పెరిగిందని, 40 శాతం పెంపు అనేది అవాస్తవమని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా డిమాండ్ పెరగడం, డ్రైవర్లకు వర్షంలో ప్రయాణించినందుకు అదనపు పరిహారం అందించడం వల్లే ఈ స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన వివరించారు. అయితే ఈ విషయంలో ఓలా, ఉబెర్ వంటి సంస్థలు ఇంకా స్పందించలేదు.
తక్కువ ధర కోసం ఏఐ (AI) సాయం
పెరుగుతున్న ఛార్జీల నుండి తప్పించుకోవడానికి టెక్నాలజీ తెలిసిన ప్రయాణికులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఆటో బుక్ చేసే ముందు మూడు, నాలుగు యాప్‌లను తనిఖీ చేసే ఇబ్బంది లేకుండా, 'బుయ్‌హాట్కే (Buyhatke)' వంటి ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అన్ని యాప్‌లలోని ధరలను ఒకేచోట పోల్చి చూస్తున్నారు. దీనివల్ల ఏ ప్లాట్‌ఫారమ్‌లో తక్కువ ధరకు రైడ్ లభిస్తుందో సులభంగా తెలుసుకోగలుగుతున్నామని ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవర్ల ఆందోళన.. ప్రభుత్వానికి విజ్ఞప్తి
మరోవైపు, పెట్రోల్,ఎల్‌పిజి ఆధారిత ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ఇస్తున్న ప్రోత్సాహం తమపై ప్రభావం చూపుతోందని వారు భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య ఇటీవల రవాణా మంత్రి రామలింగారెడ్డిని కలిసి, తాము ఎల్పీజీ నుండి సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి అవసరమైన సబ్సిడీలను అందించాలని కోరింది. ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తే పర్యావరణ హితమైన వాహనాలకు మారడానికి సిద్ధంగా ఉన్నామని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్. నటరాజ్ శర్మ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications