భారత్‌లోకి కొత్త లగ్జరీ కార్ బ్రాండ్.. ఈ కార్లు వస్తే రచ్చే!
భారత ఆటోమొబైల్ రంగానికి కొత్త కళ రాబోతోంది. ఓ కొత్త కార్ల కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం BYD(బియాండ్ యువర్ డ్రీమ్స్) తన గ్లోబల్ లగ్జరీ సబ్-బ్రాండ్ అయిన 'డెంజా'ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మెర్సిడెస్-బెంజ్, బీవైడీ భాగస్వామ్యంలో 2010లో ప్రారంభమైన ఈ డెంజా బ్రాండ్.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బీవైడీ పరిధిలోనే ఓ ప్రీమియం విభాగాలుగా కొనసాగుతోంది.
ఇండియాలో ఇప్పటికే రూ.20 లక్షల నుంచి రూ.80 లక్షల రేంజ్‌లో సీల్, అటో 3 వంటి కార్లను విడుదల చేసిన బీవైడీ.. డెంజా బ్రాండ్ ద్వారా రూ.80 లక్షలు, అంతకంటే ఎక్కువ ధర గల లగ్జరీ మార్కెట్ పై దృష్టి సారించనుంది.
1.డెంజా Z9 GT
ఇది ఓ హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ లగ్జరీ స్పోర్ట్స్ కారు. ప్రపంచవ్యాప్తంగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్‌కు కేవలం పూర్తి ఎలక్ట్రిక్ వేరియంట్ మాత్రమే రానుంది. ఈ కారులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది ఏకంగా 1,156hp అపారమైన పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 270కిలోమీటర్లు. ఒకే ఛార్జ్‌పై దాదాపు 600 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. భారత్‌కు CBU(Completely Built Unit) రూపంలో రానున్న ఈ కారు ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది నేరుగా పోర్షే టేకాన్ వంటి లగ్జరీ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2.డెంజా D9
లగ్జరీ మల్టీ-పర్పస్ వెహికల్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ డెంజా డీ9ను పరిచయం చేస్తున్నారు. ఇది నేరుగా టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎం వంటి ప్రముఖ లగ్జరీ మోడళ్లకు సవాలుగా నిలవనుంది. ఇది 7-సీటర్ సిట్టింగ్ లేఅవుట్‌తో రానుంది. ఇందులో 103 kwh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒకే ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారులో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్ లెదర్ అప్‌హోల్స్టరీ, ప్రీమియం ఆడియో సిస్టమ్, సెకండ్ రో ప్రయాణికుల కోసం ఫోల్డ్-అవుట్ టేబుల్స్, పొడిగించగల లెగ్ రెస్ట్‌లు ఉంటాయి. ఈ లగ్జరీ వాహనం ధర సుమారు రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ప్రత్యేక డీలర్‌షిప్స్
డెంజా బ్రాండ్ కార్లను సాధారణ బీవైడీ షోరూమ్‌లలో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న డెంజా లగ్జరీ అవుట్ లెట్ల ద్వారా విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ప్రారంభంలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రో నగరాలపై దృష్టి పెట్టనున్నారు. అంతే కాకుండా ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా సొంత లేదా భాగస్వామ్య వాహన ప్రాజెక్టులను వేగవంతం చేస్తుండటంతో రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త విప్లవాత్మక మార్పు రానుంది.














Click it and Unblock the Notifications
