పెట్రోల్ షాక్: అప్పులు చేస్తేనే! త్వరలోనే భారీగా ధరల పెంపు?
పశ్చిమాసియా సెగ దేశీయ చమురు సంస్థలను దహించివేస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, దేశీయంగా ధరలను స్థిరంగా ఉంచడం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పెను భారంగా మారింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ.. ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలు పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. ఫలితంగా ఈ మూడు సంస్థలు కలిపి రోజుకు దాదాపు రూ.1,600 నుంచి రూ.1,700 కోట్ల మేర భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. గత పది వారాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ నష్టాల విలువ అక్షరాలా రూ.1 లక్ష కోట్లకు చేరడం గమనార్హం.

అప్పులు చేస్తేనే ముడి చమురు కొనుగోలు!
ఈ స్థాయిలో నష్టాలు కొనసాగితే, విదేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేయడానికి అవసరమైన మూలధనం కోసం చమురు సంస్థలు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కొనుగోళ్లకే కాకుండా, భవిష్యత్తులో చేపట్టబోయే విస్తరణ పనులు, ప్రాజెక్టుల వ్యయాలపై కూడా ఈ నష్టాల ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే ధరల సమీక్ష అనివార్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం చేతుల్లోనే 'పెట్రో' నిర్ణయం
చమురు ధరల పెంపు అనేది కేవలం ఆర్థికాంశమే కాదు, అది ఒక సున్నితమైన రాజకీయ అంశం కూడా. జపాన్, యూకే వంటి దేశాలు ఇప్పటికే తమ దేశాల్లో ఇంధన ధరలను 30 శాతం వరకు పెంచేశాయి. మన దేశంలో మాత్రం ప్రభుత్వం గతంలోనే లీటరుపై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడికి ఊరటనిచ్చింది. దీనివల్ల ప్రభుత్వం కూడా ఇప్పటికే రూ.14 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలను ఎంత పెంచాలి? ఎప్పుడు పెంచాలి? అనే దానిపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది.
త్వరలోనే బాదుడు తప్పదా?
చమురు సంస్థలు కోలుకోవాలంటే లీటరుపై ధరలను పెంచడం ఒక్కటే మార్గమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కేంద్రం పెంపునకు మొగ్గు చూపితే, సామాన్యుడిపై ధరల భారం భారీగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ 'పెట్రో షాక్' కోలుకోలేని దెబ్బ కానుంది. ఏదేమైనా, చమురు సంస్థల నష్టాల పరంపర చూస్తుంటే ఇంధన ధరల పెంపు ముంగిట భారత్ నిలిచిందని స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications