బంగారం సీన్ రివర్స్.. ఒక్క రోజులో రూ. 30,000 ఢమాల్
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగు పందెంలా దూసుకెళ్లాయి. అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ (సుమారు 31.2 గ్రాములు) బంగారం ధర ఏకంగా 4395 డాలర్ల ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది. అయితే, పసిడి ప్రియులు ఆ రికార్డును ఆస్వాదించే లోపే, ధరలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు ఊహించని విధంగా పతనమయ్యాయి. 4395 డాలర్ల గరిష్టం నుంచి చూస్తే, ప్రస్తుత పతనం 4050 డాలర్ల స్థాయికి చేరుకుంది. అంటే, కేవలం 48 గంటల్లో బంగారం ధర దాదాపు 340 డాలర్లు తగ్గిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ 340 డాలర్ల పతనం భారతీయ కరెన్సీలో చూస్తే, ఇది రూ. 30,000 వరకు తగ్గినట్లుగా గమనించవచ్చు. దీనిని మనకు సుపరిచితమైన 10 గ్రాముల కొలతలో చూస్తే, కేవలం రెండు రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపు రూ. 10,000 చొప్పున పతనమవడం బంగారం మార్కెట్‌లో అతిపెద్ద రోజువారీ పతనంగా నిలిచింది. 2020 తర్వాత ఇంతటి భారీ పతనం ఇదే కావడం గమనార్హం.
పతనం వెనుక కారణాలేంటి?
బంగారం ధరలు ఈ విధంగా ఒక్కసారిగా తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలను నిపుణులు చెబుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ విలువ గరిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్ బలపడినప్పుడు, దాని విలువకు విరుద్ధంగా ట్రేడ్ అయ్యే బంగారం ధరలు తగ్గడం సహజం.
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర దాదాపు 60 శాతం పెరిగింది. ఈ భారీ పెరుగుదల తర్వాత, పసిడి ధరలు 'ఓవర్ బాట్' (అతిగా కొనుగోలు చేసిన) స్థానానికి చేరుకున్నాయని నిపుణులు విశ్లేషించారు. దీంతో, చాలా మంది ఇన్వెస్టర్లు భారీ లాభాలను బుక్ చేసుకోవడానికి అమ్మకాలు చేపట్టారు.
డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జింపింగ్ మధ్య సమావేశం జరుగుతుందనే వార్తలు మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి అయిన బంగారం నుంచి వైదొలగి, రిస్క్ ఉన్న ఇతర మార్కెట్లవైపు దృష్టి సారించారు.రాబోయే అమెరికా వినియోగదారుల ధరల సూచీ (CPI) నివేదిక కూడా బంగారం ధరలను ప్రభావితం చేయనుంది.
బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి భారీగా తగ్గడం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట కలిగించే అంశమే అయినా, ఈ పతనం ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి. మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకుని, ఆచితూచి అడుగు వేయడం పసిడి ప్రియులకు శ్రేయస్కరం.












Click it and Unblock the Notifications