కలెక్షన్లు దుమ్ము రేపాయ్: రూ. 2 లక్షలకు కొంచెం తక్కువ: వీటి వాటా ఎక్కువ
జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 14.8 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జులైతో పోల్చుకున్నా కూడా ఆగస్టులో రెవెన్యూ పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రతిబింబించేలా వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నెలలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,99,853 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.1,74,116 కోట్లతో పోలిస్తే ఇది 14.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మొత్తంలో దిగుమతులపై వచ్చిన పన్నుల వాటా అధికం. విదేశీ వస్తువుల దిగుమతుల ద్వారా లభించిన ఐజీఎస్‌టీ (IGST) వసూళ్లు ఏకంగా 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరాయి. అదే సమయంలో దేశీయ లావాదేవీలపై లభించిన స్థూల జీఎస్‌టీ రాబడి కూడా 9.3 శాతం మేరకు పురోగమించింది. రూ.1,37,249 కోట్లుగా నమోదైంది.

ఆగస్ట్ లో దేశవ్యాప్తంగా విభిన్న వ్యాపార సంస్థలు, పరిశ్రమలకు సర్కారు చెల్లించిన జీఎస్‌టీ రీఫండ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 31,795 కోట్ల విలువైన పన్ను రీఫండ్లను ప్రభుత్వం జారీ చేసింది. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన రూ.18,935 కోట్ల రీఫండ్లతో పోలిస్తే ఇది ఏకంగా 67.9 శాతం పెరిగింది. పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత వేగవంతమైందనడానికి ఈ రీఫండ్ల పెరుగుదలను నిదర్శనంగా తీసుకోవచ్చు.
అన్ని రకాల పన్ను రీఫండ్లు మినహాయించిన తర్వాత ప్రభుత్వం వద్ద మిగిలిన నికర జీఎస్‌టీ వసూళ్లు ఈ నెలలో రూ.1,68,057 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి సంబంధించిన రూ. 1,55,181 కోట్ల నికర వసూళ్లతో పోల్చి చూస్తే ఇది 8.3 శాతం నికర వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇందులో దేశీయ నికర రాబడి రూ. 1,18,759 కోట్లు కాగా, కస్టమ్స్ దిగుమతుల ద్వారా లభించిన నికర పన్ను రూ. 49,299 కోట్లు.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అయిదు నెలల కాలంలో రూ. 9,39,724 కోట్లుగా ఉన్న స్థూల వసూళ్లు, ఈసారి 11 శాతం వృద్ధి రేటును అందుకున్నాయి. ఏకంగా రూ. 10,42,757 కోట్లకు చేరాయి. ఇక ఈ అయిదు నెలల కాలానికి గాను ప్రభుత్వం చెల్లించిన మొత్తం రీఫండ్ల మినహాయింపుల తర్వాత సాధించిన నికర రాబడి కూడా మెరుగైన స్థాయిలో ఉంది. గత ఏడాది సాధించిన రూ. 8,15,939 కోట్లతో పోలిస్తే, ఈసారి తొమ్మిది శాతంతో రూ. 8,89,523 కోట్లకు చేరింది.













Click it and Unblock the Notifications