రూపాయి రాజసం, డాలర్ అవసరం లేదు.. ఇక అంతా మన కరెన్సీలోనే
అంతర్జాతీయ వాణిజ్యంలో భారత రూపాయి ఆధిపత్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ఇన్నాళ్లూ విదేశీ వ్యాపారంలో ఎగుమతిదారులకు ఎదురవుతున్న సాంకేతిక, ఆచరణాత్మక ఇబ్బందులను తొలగిస్తూ విదేశీ వాణిజ్య విధానంలో (FTP) కీలక సవరణలు చేసింది. ఈ నిర్ణయంతో మన దేశం నుంచి వస్తువులను విదేశాలకు విక్రయించే వ్యాపారులు ధైర్యంగా రూపాయిల్లో చెల్లింపులు స్వీకరించే అవకాశం లభించింది. ఫలితంగా కరెన్సీ మార్పిడి ఖర్చులు తగ్గడమే కాకుండా, ప్రపంచ మార్కెట్‌లో భారత ఎగుమతులకు సరికొత్త డిమాండ్ ఏర్పడనుంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఫారిన్ ట్రేడ్ పాలసీలో చేసిన మార్పుల ప్రకారం.. ఇకపై రూపాయిల్లో జరిపే ఎగుమతుల లావాదేవీలకు కూడా ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల వాణిజ్య ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. గతంలో ఇతర దేశాల కొనుగోలుదారులు రూపాయిల్లో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనల వల్ల డాలర్లలోకి మార్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా రూపాయిల్లోనే వ్యాపారం పూర్తి చేసుకోవచ్చు. ఇది భారత ఉత్పత్తుల ధరల పోటీతత్వాన్ని మరింత పెంచుతుంది.

గణనీయంగా పెరుగుతున్న రూపాయి వాణిజ్యం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాలు కూడా దేశీయ కరెన్సీ పెరుగుతున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. రూపాయిల్లో ఇన్వాయిస్ చేసిన ఎగుమతులు మరియు దిగుమతుల విలువ ఏడాదికేడాది గణనీయంగా పెరుగుతోంది. అలాగే ప్రత్యక్ష చెల్లింపుల పరంగా చూసినా ఎగుమతి, దిగుమతి లావాదేవీల్లో రూపాయి వినియోగం మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇరాన్, రష్యాల అనుభవాల పాఠాలు
రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చే క్రమంలో భారత్‌కు ఇరాన్, రష్యాలతో జరిగిన వ్యాపార అనుభవాలు ఎంతో నేర్పాయి.
2012లో అమెరికా ఆంక్షల వేళ ఇరాన్ నుంచి చమురు దిగుమతుల కోసం 45% చెల్లింపులను రూపాయిల్లోనే జరిపారు. అయితే భారత్ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటంతో ఇరాన్ వద్ద రూపాయి నిల్వలు పెరిగిపోయి, వాటిని ఎక్కడ వాడాలో తెలియక సమస్య ఎదురైంది.
2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా వద్ద కూడా బిలియన్ల కొద్దీ భారత రూపాయలు జమ అయ్యాయి. రూపాయి నిల్వలను తిరిగి ఉపయోగించుకునేందుకు తగినంతగా భారత్ నుంచి కొనుగోలు చేసే అవకాశం లేకపోవడమే దీనికి కారణం.
ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న భారత్, విదేశాలు తమ వద్ద ఉన్న రూపాయిలను భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు మరియు ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేలా ఆర్‌బీఐ ద్వారా కొత్త మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.
యూఏఈ మోడల్.. బ్రిక్స్ వేదికగా అడుగులు
యూఏఈతో భారత్ కుదుర్చుకున్న స్థానిక కరెన్సీ చెల్లింపుల ఒప్పందం గొప్ప విజయవంతమైంది. వాణిజ్య లోటు లేకుండా ఇరుదేశాలు తమ సొంత కరెన్సీల్లోనే చెల్లింపులు చేసుకుంటున్నాయి. ఇదే తరహాలో ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్‌లతో కూడా ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు బ్రిక్స్ కూటమిలోనూ డాలర్‌పై ఆధారపడటం తగ్గించి, వేగవంతమైన డిజిటల్ చెల్లింపులు, ఆయా దేశాల సొంత కరెన్సీల వినియోగాన్ని పెంచేందుకు భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.














Click it and Unblock the Notifications