ఒక్క ఫుల్ ట్యాంక్.. ఏకంగా 1,980 కి.మీ! గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన కారు!!
ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు తమ వాహనాలను మరింత సామర్థ్యంతో మంచి మైలేజీ ఇచ్చేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రత్యేకమైన ఇ-పవర్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఓ కొత్త మైలురాయిని సాధించింది. నిస్సాన్ ఖష్కాయ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేకుండా, పెట్రోల్ రీఫిల్ చేయకుండా ఒకే ఫ్యూయల్ ట్యాంకుతో 1,980 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత సుదూర ప్రాంతాన్న అధిగమించిన నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఇది రికార్డు సాధించింది.
గొప్ప మైలేజ్
విశేషమేమిటంటే, ఈ కారు ఈ రికార్డును ఏదో మూసివున్న ప్రయోగశాలలో కాకుండా, నిజమైన రహదారి, ట్రాఫిక్ పరిస్థితులలో నెలకొల్పింది. ఖష్కాయ్ 55-లీటర్ల ఇంధన ట్యాంక్ ఆధారంగా ఈ కారు లీటరుకు సుమారు 36 కిలోమీటర్ల (36 కిమీ/లీ) ఆకట్టుకునే మైలేజీని సాధించింది. ఈ ప్రయాణం 2026 జూలై 14 నుంచి 17 మధ్య కొలంబియాలో జరిగింది. ఈ వాహనం సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న బొగోటా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి కరేబియన్ తీరానికి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మార్గమధ్యలో హైవేలు, నగర ట్రాఫిక్, అనేక కష్టతరమైన మార్గాలు ఉన్నాయి. ఎత్తు నుంచి కిందికి దిగేటప్పుడు వాహనంలోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, వాలుపై బ్రేక్ వేయడం వల్ల ఉత్పత్తి అయిన శక్తిని తిరిగి విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.

అనుభవజ్ఞులైన డ్రైవర్ల కచ్చితమైన వేగ నియంత్రణ, నిస్సాన్ ఇ-పవర్ సిస్టమ్ కారణంగా వాహనం అంత సుదీర్ఘ దూరాలను ప్రయాణించగలిగింది.ఈ కారు ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేదా ఇంధనం నింపకుండా అత్యంత సుదూర ప్రయాణం చేసే నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశించింది.
నిస్సాన్ ఇ-పవర్ టెక్నాలజీ ఎలా భిన్నమైనది?
సాధారణంగా హైబ్రిడ్ కార్లను తిప్పడానికి పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి పనిచేస్తాయి. కానీ నిస్సాన్ రూపొందించిన ఇ-పవర్ సిస్టమ్ చాలా భిన్నమైనది, ప్రత్యేకమైనది. ఈ వాహనంలో, చక్రాలు కేవలం ఎలక్ట్రిక్ మోటార్‌తో మాత్రమే నడుస్తాయి. పెట్రోల్ ఇంజన్‌కు ప్రత్యక్ష సంబంధం లేదు. ఇందులో అమర్చిన పెట్రోల్ ఇంజన్ కేవలం ఒక జనరేటర్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఇది వాహనం బ్యాటరీని ఛార్జ్ చేసి, ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని సరఫరా చేస్తుంది. దీని వల్ల డ్రైవర్ కు పూర్తి ఎలక్ట్రిక్ కారు నడుపుతున్నంత నిశ్శబ్ధమైన, వేగవంతమైన డ్రైవింగ్ అనుభూతి లభిస్తుంది.
ఈ టెక్నాలజీ భారతదేశానికి వస్తుందా?
నిస్సాన్ గతంలో యూకే, టాస్మానియాలో ఇలాంటి సుదీర్ఘ మైలేజ్ పరీక్షలను నిర్వహించింది, కానీ కొలంబియాకు చేసిన ఈ పర్యటన గిన్నిస్ వరల్డ్ రికార్డును గెలుచుకున్న మొట్టమొదటిదిగా నిలిచింది. నిస్సాన్ ప్రస్తుతం ఇండియాలో ఇ-పవర్ టెక్నాలజీతో కూడిన కార్లను విక్రయించనప్పటికీ, భారత మార్కెట్ కోసం అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ భారతదేశానికి వస్తే, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా ఎలక్ట్రిక్ కారు లాంటి డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వారికి ఈ టెక్నాలజీ ఓ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారనుంది.




Click it and Unblock the Notifications