CSK కొత్త హెడ్ కోచ్ గా భారత మాజీ పేసర్ నియామకం- ఫ్లెమింగ్ స్ధానంలో..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లలో ఆటగాళ్లు, సిబ్బంది మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే సీజన్ కోసం త్వరలో మినీ వేలం జరగనుంది. దీనికి సన్నాహకంగా చేపట్టాల్సిన మార్పుల విషయంలో కసరత్తు చేస్తున్న పలు ఫ్రాంచైజీలు.. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదే క్రమంలో గత సీజన్ లో ఆశించిన స్ధాయిలో ప్రదర్శన లేని జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) .. తమ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) కు గుడ్ బై చెప్పేసింది. ఆయన స్ధానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ను హెడ్ కోచ్ గా నియమించింది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే.. ఆరు విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ కు సైతం అర్హత సాధించలేకపోయింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడకపోవడం, అసలు ఎప్పుడు ఆడతాడో కూడా తెలియకుండా చివరి నిమిషం వరకూ అభిమానుల్ని డైలమాలో ఉంచి మైదానాలకు రప్పించడంతో సీఎస్కేపై విమర్శలు తప్పలేదు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగతంగా రాణించినా జట్టును ధోనీ తరహాలో జోష్ తో ముందుకు నడిపించలేకపోయాడు. దీంతో పాటు సీఎస్కే ఆరంభం నుంచీ హెడ్ కోచ్ గా ఉన్న ఫ్లెమింగ్ పై ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో వచ్చే సీజన్ కు ఆయన హెడ్ కోచ్ గా తప్పుకున్నాడు.

ఫ్లెమింగ్ స్దానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కు సీఎస్కే హెడ్ కోచ్ గా అవకాశం కల్పించింది. గతంలో 2003లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో జహీర్ ఖాన్ సభ్యుడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కొత్త కోచ్ ఎవరన్న ప్రశ్నకు జహీర్ ఖాన్ రూపంలో సీఎస్కే మంచి సమాధానమే వెతుక్కుంది. IPL 2027లో పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎస్కేలో జహీర్ ఖాన్ తన మాజీ సహచరుడైన ధోనీతో కలిసి సన్నిహితంగా పనిచేస్తారని ఫ్రాంచైజీ అంచనా వేస్తోంది. మరి సీఎస్కే అంచనాల్ని జహీర్ ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి మరి.














Click it and Unblock the Notifications
