లోన్లు తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వడ్డీ!
దేశంలో మళ్లీ రుణాలు భారం కానున్నాయా? ఈ ప్రశ్నకు ఆర్థిక నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. రాబోయే అక్టోబర్ నెలలో జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల మంట కారణంగా ఆర్‌బీఐ తన రెపో రేటును O.25 బేసిస్ పాయింట్లు పెంచే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి.
దేశంలో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం ఒక్కసారిగా విస్తరిస్తోంది. ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. గత జనవరిలో కేవలం 22 రకాల వస్తువుల ధరలు మాత్రమే ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేయగా, ఆగస్టు నాటికి ఆ సంఖ్య ఏకంగా 51కి చేరుకుంది. అంటే నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల కేవలం కొన్నింటికే పరిమితం కాకుండా అన్నింటికీ పాకింది. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరగగా, ఆహార పదార్థాల ధరల పెరుగుదల ఏకంగా 5.66 శాతానికి ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు ఏకంగా 102 డాలర్లకు చేరుకుంది. గతంలో ఆర్‌బీఐ అంచనా వేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ. ఈ చమురు ధరల పెరుగుదల ప్రభావంతో రాబోయే రోజుల్లో దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత గరిష్ట పరిమితి అయిన 6 శాతాన్ని దాటే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ దేశాల బాటలోనే మన ఆర్‌బీఐ?
కేవలం దేశీయ కారణాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు కూడా వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో, మన దేశంలోనూ పెట్టుబడులు పారిపోకుండా ఉండేందుకు, రుణాలు ఖరీదైనవిగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల బాండ్ ఈల్డ్స్ పెరిగి రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
నిపుణుల భిన్నాభిప్రాయాలు.. ఏం జరగనుంది?
అక్టోబర్ పాలసీలో రేట్ల పెంపు ఉంటుందని కొందరు నిపుణులు గట్టిగా చెబుతున్నారు. మోతీలాల్ ఓస్వాల్ సంస్థకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ రాధికా పిప్లానీ మాట్లాడుతూ.. చమురు ధరలు ఇదే విధంగా ఉంటే ఆర్‌బీఐ ఎలాంటి జాప్యం చేయకుండా అక్టోబర్‌లోనే రేట్లు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, మరోవైపు శ్రీరామ్ ఫైనాన్స్ చీఫ్ ఎకనామిస్ట్ అపూర్వ జావడేకర్ మాత్రం ఈ పెంపు చాలా స్వల్పంగానే ఉంటుందని, వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో రేట్లు విపరీతంగా పెంచే అవకాశం లేదని విశ్లేషించారు. కారణాలు ఏమైనప్పటికీ, రాబోయే రోజుల్లో సామాన్యులకు ఈఎంఐల భారం పెరిగే సూచనలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
