ట్రైబర్ vs ఎర్టిగా.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీకి ఏ కారు బెస్ట్?
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తక్కువ బడ్జెట్లో 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ టర్బో, మారుతి సుజుకి ఎర్టిగా ప్రధాన ఎంపికలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా మారుతి ఎర్టిగాతో పోలిస్తే కొత్తగా వచ్చిన రెనాల్ట్ ట్రైబర్ టర్బో ధర సుమారు రూ.1 లక్ష వరకు తక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండు వాహనాలు వేర్వేరు రకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ఈ రెండింటిలో ఏ కారు ఎవరికి బెస్ట్ అనేది వివరంగా తెలుసుకుందాం.
రెనాల్డ్ ట్రైబర్ టర్బో ప్రత్యేకతలు
రెనాల్ట్ తన ప్రజాదరణ పొందిన ట్రైబర్‌లో కొత్తగా 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను పరిచయం చేసింది. ఈ ఇంజన్ 100 ps పవర్, 180 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రైబర్ టర్బో ప్రారంభ ధర రూ.7.84 లక్షలుగా(ఎక్స్-షోరూమ్) ఉంది. పరిమాణంలో ఇది 3,985 మిల్లిమీటర్ల పొడవుతో సబ్-4 మీటర్ కేటగిరీలోకి వస్తుంది. తక్కువ పొడవు ఉన్నప్పటికీ.. ఇంటీరియర్ స్పేస్‌ను రెనాల్ట్ అద్భుతంగా నిర్వహించింది. దీనిలో 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగా ప్రత్యేకతలు
మారుతి ఎర్టిగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న పూర్తి స్థాయి 7-సీటర్ ఎంపీవీ. దీని ప్రారంభ ధర రూ.8.90 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 101.64 bhp పవర్, 139 Nm టార్క్‌ను అందిస్తుంది. 4,395 మిల్లిమీటర్ల పొడవు ఉండటం వల్ల మూడో వరుసలో ప్రయాణించే వారికి మెరుగైన లెగ్ రూమ్, సౌకర్యం లభిస్తాయి. అంతే కాకుండా మారుతి సుజుకి ఎర్టిగాలో కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అమ్మకానంతర సేవలు, నిర్వహణ
ఈ రెండు కార్ల మధ్య మరో ముఖ్యమైన తేడా సర్వీసింగ్ నెట్వర్క్. మారుతి సుజుకికి దేశవ్యాప్తంగా విస్తృతమైన డీలర్ షిప్స్, సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. స్పేర్ పార్ట్స్ సులభంగా, తక్కువ ధరకే లభిస్తాయి. ఎక్కడైనా సులభంగా రిపేర్ చేయించుకునే సౌలభ్యం ఉంటుంది. రెనాల్ట్ నెట్వర్క్ పెరుగుతున్నప్పటికీ.. మారుతి స్థాయిలో విస్తరించి లేదు.
ఏ కారు ఎవరికి బెస్ట్?
రెనాల్ట్ ట్రైబర్ టర్బో: రోజువారీగా నగరంలో ప్రయాణిస్తూ పార్కింగ్ సమస్యలు లేకుండా చిన్నకారు కావాలనుకుని, కేవలం అప్పడప్పుడు మాత్రమే 7 సీట్ల అవసరం పడే కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
మారుతి సుజుకి ఎర్టిగా: తరచూ కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసేవారు, ప్రతిసారీ 7 మంది ప్రయాణించే అవసరం ఉన్నవారు, మెరుగైన రీసేల్ వాల్యూ, సులువైన సర్వీసింగ్ కోరుకునే వారికి మారుతి ఎర్టిగా బెస్ట్ ఛాయిస్.














Click it and Unblock the Notifications
