• search

పీఎన్బీలో ‘అనధికారిక’ లావాదేవీలు: స్కామ్ విలువ రూ.11 వేల కోట్లపై మాటే!!

By Swetha Basvababu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ/ ముంబై: ఆ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండోది. ఇప్పటి వరకు మొండి బకాయిలు ఉన్నా ఒకింత లాభాలార్జిస్తున్న బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి పేరుంది. కానీ అదే బ్యాంకు ముంబై శాఖ ఆ పేరును మరో రూపంలో తిరగేసింది. ముంబైలోని పీఎన్బీ శాఖలో 1.77 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,400 కోట్ల) మేర మోసం వెలుగు చూసింది.
  అత్యంత సంపన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మరో ఆభరణాల కంపెనీ కలిసి సంయుక్తంగా మోసపూరిత లావాదేవీలు పాల్పడినట్లు బ్యాంకు వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేశాయి.

  ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ధరించే ఆభరణాలను నీరవ్ మోదీ సమకూరుస్తారని ప్రతీతి. అటువంటి వ్యాపారి రూ.280 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఈ నెల 5న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచే అందిన ఒక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది.

  ఇతర బ్యాంకులకూ స్కాం విస్తరించే చాన్స్

  ఇతర బ్యాంకులకూ స్కాం విస్తరించే చాన్స్

  ఈ కుంభకోణానికి బాధ్యులను చేస్తూ బ్యాంక్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌తో సహా 10 మంది ఉద్యోగులపై పీఎన్బీ వేటు వేసింది. నీరవ్ మోదీ మోసాలపై సీబీఐకి పీఎన్బీ ఫిర్యాదు చేయడం 10 రోజుల్లో ఇది రెండోసారి. ఇప్పటికే మొండి బకాయిలతో అస్తవ్యస్థంగా మారిన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక పరిస్థితిపై తాజా పరిణామం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కనిపిస్తున్నది. కానీ దీనిపై స్పందించేందుకు ఆర్బీఐ అధికారులెవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇది ఇతర బ్యాంకులకూ పాకి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  డీజీఎం ప్రమేయంతో జరిగినట్లు సంకేతాలు

  డీజీఎం ప్రమేయంతో జరిగినట్లు సంకేతాలు

  బ్యాంకు శాఖలో జరిగిన ‘అనధికార లావాదేవీ'ల సంగతిపై మంగళవారం రాత్రే ఈ విషయాన్ని సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు పీఎన్బీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి కలిగించడానికి తమ సిబ్బంది తప్పుడు ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌' (ఎల్‌ఒయూ) ద్వారా కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వీటిని చూపి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచీ రుణాలు పొంది ఉంటారని తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా ఈ పత్రాల ద్వారా వీరికి రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సదరు ఆభరణాల కంపెనీ పేరును సీబీఐ వెల్లడించలేదు. వాస్తవంగా ఎలాంటి అక్రమం జరిగిందో కూడా అధికారులెవరూ బయటపెట్టలేదు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల ప్రమేయంతో 2011 నుంచి ఇది జరుగుతూ వస్తోందని మాత్రం తెలుస్తోంది. ఇలాంటి లావాదేవీలు పునరావృతం కాకుండా బ్యాంకులన్నీ సమీక్షించుకుంటున్నాయనీ, సాధ్యమైనంత త్వరగా స్థాయీ నివేదికను అవి సమర్పించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థల అధికారులు చెప్పారు. మోసపూరిత లావాదేవీలపై హాంకాంగ్‌ సహకారాన్ని అభ్యర్థించాలని ఆర్బీఐ, సెబీ భావిస్తున్నాయి.

  ఆందోళన అనవసరమన్న ఆర్థిక శాఖ

  ఆందోళన అనవసరమన్న ఆర్థిక శాఖ

  ఈ సంస్థలు వ్యాపారం కోసమని బ్యాంకుల నుంచి తీసుకునే నిధులను చివరికి ఎలా ఉపయోగిస్తున్నాయనే దానిపై సీబీఐతో పాటు ఈడీ వివరాలు సేకరిస్తున్నట్టు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఉన్నతాధికారి చెప్పారు. దీనిపై ఈ జువెలరీ సంస్థలేవీ నోరు మెదపడం లేదు. మరోవైపు నిజాయితీగా వ్యాపారం చేసే వారిని వేధించకుండా, అక్రమార్కులు ఎంతటి పెద్దవారైనా వదలొద్దని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఈ కుంభకోణం గురించి ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితులేమీ చేయి దాటలేదని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొన్నది. అన్ని బ్యాంకులు దీనిపై ఈ వారాంతంలోగా స్టేటస్‌ నివేదిక సమర్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరింది. ఈ కుంభకోణంపై చర్యలు చేపడుతున్నామని, దీని వెనుక ఉన్న దోషులను కోర్టు ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించడానికి ప్రయత్నిస్తామని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్‌, సంయుక్త కార్యదర్శి లోక్ రంజన్ స్పష్టం చేశారు. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో ఇలాంటి కుంభకోణాలు మళ్లీ తలెత్తకుండా నివారించేందుకు తీసుకోవలసిన చర్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాయి.

  మార్కెట్ లావాదేవీలపై సెబీ విచారణ?

  మార్కెట్ లావాదేవీలపై సెబీ విచారణ?

  సీబీఐ అధికారులు మాత్రం ఈ అక్రమ లావాదేవీలతో మోదీకి, మరో జువెలరీ సంస్థకు ప్రమేయం ఉందని చెప్పారు. నీరవ్‌ మోదీ నిర్వాకంతో దర్యాప్తు సంస్థలు గీతాంజలి, జిన్ని, నక్షత్ర వంటి పెద్ద జువెలరీ సంస్థల ఆర్థిక లావాదేవీలపైనా దృష్టి పెట్టాయి. పీఎన్బీని రూ.280 కోట్ల మేరకు మోసగించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే నీరవ్‌ మోదీ, ఆయన భార్య అమి, సోదరుడు నిశాల్‌, మెహుల్‌ చినుభాయ్‌ చోక్సిలపై అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసులు నమోదు చేసింది. వీరందరూ డైమండ్‌ ఆర్‌యుఎస్‌, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్‌, స్టెల్లార్‌ డైమండ్స్‌ అనే కంపెనీల పేరుతో తమ నుంచి అక్రమంగా లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు) తీసుకున్నట్టు పీఎన్బీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌, పీఎన్బీ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకున్నది. మోసపూరితంగా సంపాదించిన ఈ నిధుల ద్వారా వీరు అక్రమంగా ఏమైనా ఆస్తులు, నల్ల ధనం పోగు చేశారా? అనే విషయంపైనా ఈడీ దర్యాప్తు చేయబోతోంది. వివిధ బ్యాంకులతో వీటికి ఉన్న అవగాహన, డబ్బు చివరకు ఎక్కడకు చేరిందనే విషయాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయని చెప్పారు. మరోవైపు లిస్టెడ్‌ బ్యాంకులు, జువెలరీ సంస్థలు ఈ కుంభకోణానికి సంబంధించి వెల్లడించాల్సిన విషయాల విషయంలో ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాయా? అనే విషయంపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ' కూడా దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉన్నదని సమాచారం. ఈ కంపెనీల షేర్ల లావాదేవీల వివరాలనూ సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు పరిశీలించే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటికే కొన్ని కంపెనీల ఉన్నతాధికారులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  తనకు తాను బ్రాండ్ సృష్టించుకున్న నీరవ్ మోదీ

  తనకు తాను బ్రాండ్ సృష్టించుకున్న నీరవ్ మోదీ

  ఆభరణాలకు చూడచక్కని ఆకృతులనిచ్చే నీరవ్‌ మోదీ... ప్రపంచంలో వజ్రాలకు రాజధానిగా చెప్పే బెల్జియంలోని యాంట్వెర్ప్‌లో పెరిగిన వ్యక్తి. తన పేరిటే ఒక బ్రాండును సృష్టించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరిగా స్థానం పొందారు. రూ.280 కోట్ల మేర బ్యాంకును మోసగించి, తప్పుడు సంతకాలు చేశారంటూ అతనితో పాటు భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్‌ మోదీ, గీతాంజలి పేరుతో గొలుసుకట్టు ఆభరణాల దుకాణాలు నిర్వహించే మెహుల్‌ ఛోక్సి (నీరవ్‌ మామ)లపైనా ఈ నెలారంభంలో సీబీఐ కేసు నమోదైంది. వీరంతా వివిధ కంపెనీల్లో భాగస్వాములు. బ్యాంకు వ్యవస్థలో ఎక్కడా వివరాలు నమోదు కాకుండా నీరవ్‌ సంస్థల్లోకి రూ.280 కోట్లు వెళ్లేలా ఎనిమిది ఎల్‌వోయూలను తప్పుడు పద్ధతుల్లో బ్యాంకు సిబ్బందే రూపొందించారని తొలి ఫిర్యాదులో పీఎన్‌బీ తెలిపింది. దిగుమతి చేసుకున్న సరకుకు విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లింపులు జరపాలని ఈ మోసానికి పాల్పడినట్లు చెప్పింది. నీరవ్‌ మోదీ 2016లో ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల జాబితాలో చోటు సంపాదించడం విశేషం. అతని నికర ఆస్తుల విలువ 1.74 బిలియన్‌ కోట్లు (సుమారు రూ.11,658 కోట్లు) ఉంటుందని ఫోర్బ్స్‌ తేల్చింది. క్రిస్టీ, సోథిబే వంటి ప్రఖ్యాత సంస్థల వేలంపాటల్లో తరచూ పాల్గొనడం నీరవ్‌కు అలవాటు.

  రూ.3,844 కోట్ల మదుపర్ల ఆస్తి హాంఫట్

  రూ.3,844 కోట్ల మదుపర్ల ఆస్తి హాంఫట్

  గతనెల 16న డైమండ్‌ ఆర్‌యుస్‌, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్‌, స్టెల్లార్‌ డైమండ్స్‌ అనే మూడు డైమండ్‌ కంపెనీలు బయ్యర్స్‌ క్రెడిట్‌ కావాలని ముంబైలోని ఒక పీఎన్బీ శాఖ అధికారులను కోరాయి. విదేశీ సరఫరాదారులకు చెల్లించేందుకు అవసరమైన ఈ రుణం కోసం లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు) కావాలని ఈ మూడు సంస్థలు విజ్ఞప్తి చేయడంతో 100 క్యాష్‌ మార్జిన్లు (పూర్తి నగదు) సమర్పించాలని స్థానిక పీఎన్బీ శాఖ కోరింది. అప్పుడు ఈ మూడు సంస్థలు ‘అబ్బే అదేం లేదు. గతంలోనూ మేము క్యాష్‌ మార్జిన్లేవీ లేకుండానే ఎల్వోయూలు తీసుకున్నాం' అని వాదించాయి. రికార్డులను పరిశీలించిన అధికారులకు అలాంటిదేమీ లేదని అర్థమైంది. మరింత లోతుగా పరిశీలించే సరికి ఈ కుంభకోణం బయట పడింది. పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై తీసుకున్న ఎల్‌ఒయుల ఆధారంగా ఈ డైమండ్‌ వ్యాపార సంస్థలు విదేశాల్లోని ఇతర బ్యాంకుల నుంచీ పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌లు తీసుకునేవని తెలుస్తోంది. తాజాగా బయట పడిన కుంభకోణం పీఎన్బీని కుదిపేస్తోంది. ఈ అక్రమ లావాదేవీల విలువ బ్యాంకు షేర్ల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (రూ.36,000 కోట్లు)లో మూడో వంతుకు సమానం. డిసెంబర్ 2017నాటికి బ్యాంకు రుణాలుగా ఇచ్చిన రూ.4.5 లక్షల కోట్లలో ఇది 2.55 శాతం. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పీఎన్బీ ఆర్జించిన రూ.1,324 కోట్ల నికర లాభానికి ఎనిమిది రెట్లు ఎక్కువ. ఈ భారీ కుంభకోణం బయటికి పొక్కడంతో స్టాక్‌ మార్కెట్‌లో పిఎన్‌బి షేర్లు కుప్పకూలాయి. బిఎ్‌సఇలో ఈ షేరు 9.81 శాతం నష్టపోయి రూ.145.80 వద్ద ముగిసింది. దీంతో ఒక్కరోజులోనే ఈ బ్యాంక్‌ షేర్లలో మదుపు చేసిన ఇన్వెస్టర్ల సంపద విలువ రూ.3,844 కోట్లు హరించుకుపోయింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mumbai: Punjab National Bank (PNB) said it has detected a Rs11,400 crore fraud at a single branch in Mumbai, the impact of which could extend to other public sector banks as well. PNB has detected some fraudulent and unauthorized transactions in one of its branches in Mumbai “for the benefit of a few select account holders with their apparent connivance,” it said in an exchange filing on Wednesday. “Based on these transactions other banks appear to have advanced money to these customers abroad.”

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more